తెలంగాణ పీసీసీకి కొత్త అధ్య‌క్షుడు రెడీనా..!

-

లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కాంగ్రెస్ పెద్దగా కోలుకున్నట్లు అనిపించడం లేదు. బీజేపీ రోజురోజుకి ఇంకా బలపడుతుంటే, కాంగ్రెస్ పరిస్తితి ఇంకా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు నాయకత్వ లేమితో కాంగ్రెస్ కొట్టుమిట్టాడింది. అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకోవడంతో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు కోసం రెండు నెలలుగా వెతుకుతూ చివరికి వేరే దారి లేక సోనియా గాంధీనే బాధ్యతలు చేపట్టాలని సి‌డబ్ల్యూ‌సి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీంతో సోనియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

A big challenge for Telangana Pcc president

ఇక కేంద్రంలో కొత్త నాయకత్వం రావడంతో, రాష్ట్రాల్లో కూడా కొత్త నాయకత్వాలకి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది చర్చకి వచ్చింది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ సారథ్యంలో నడుస్తోంది. అయితే ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ని అన్నీ ఓటములే వెంటాడాయి. పైగా టీఆర్ఎస్ బాగా బలంగా ఉంది. దీనికి తోడు బీజేపీ బలపడుతూ ఉంది. కాంగ్రెస్ ప్లేస్ కూడా తీసేసుకుని టీఆర్ఎస్ కి ధీటుగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో నాయకత్వ బాధ్యతలు కొత్త వాళ్ళకి అప్పగిస్తే బాగుంటుందని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది.

అందులోనూ టీఆర్ఎస్ కి ధీటుగా కౌంటర్లు ఇచ్చే ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అని అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. రేవంత్ అయితే టీఆర్ఎస్ తో పాటు బీజేపీని కూడా సమర్ధవంతంగా ఎదురుకుని కౌంటర్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ పీసీసీ పదవికి రేవంత్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. మొదటి నుంచి వి‌హెచ్ లాంటి సీనియ‌ర్ నేత‌లు ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేదంటూ అలిగి కూర్చున్నారు.

అటు జానారెడ్డి, కోమ‌టిరెడ్డి, పొన్నాల, శ్రీధర్ బాబు ఇలా ఆశావ‌హుల జాబితా పెద్ద‌దే ఉంది. వీరు ఈలోపు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేయడం కూడా మొదలుపెట్టేశారు. అయితే వీరిని కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కి పదవి ఇస్తే ఎంతమంది సహకరిస్తారనేది కూడా చెప్పలేం. ముందు టీఆర్ఎస్, బీజేపీలని ఎదురుకోవడం కంటే సొంత పార్టీని ఆర్డర్ లో పెట్టడం రేవంత్ కి పెద్ద సవాల్ అవుతుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది. దీంతో పార్టీలో అలజడి చెలరేగిన ఏదొక కఠిన నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి పీసీసీ పగ్గాలు ఇస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news