సీఎంలంతా ఎంపీలే… ఆ ముగ్గురు తప్ప..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎలాంటి పదవి లేకుండానే నేరుగా మంత్రులయిన వాళ్లున్నారు. ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ముఖ్యమంత్రి అయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏపీ సీఎం పదవి చేపట్టిన వారిలో ముగ్గురు తప్ప మిగిలిన వారంతా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన వారే.

1983లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన నందమూరి తారక రామారావు ఆ వెంటనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్టీఆర్… థర్డ్ ఫ్రంట్ కోసం జాతీయ స్థాయిలో చక్రం తిప్పినప్పటికీ… పార్లమెంట్ కు మాత్రం దూరంగానే ఉన్నారు.

ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కూడా ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. గతంలో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు కూడా. వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబు… లోక్ సభ వైపు చూసే అవకాశం లేదంటున్నారు సన్నిహితులు.

వీరిద్దరితో పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటి వరకు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించలేదు. 1989లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన కిరణ్… 2010లో స్పీకర్ పదవి నుంచి సీఎంగా ప్రమోషన్ కొట్టేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం… రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

ఇంకా ఇప్పటి వరకు సీఎంలుగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, పీవీ నరసింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన వారే.

Read more RELATED
Recommended to you

Latest news