తెలంగాణలో ఇటీవల వందరోజుల పాలనను పూర్తి చేసుకున్న రేవంత్ సర్కారు సంబరాలు కూడా చేసుకుంది. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఎవ్వరినీ వదలబోమని అందరినీ కటకటాల్లోకి పంపుతామని హెచ్చరించారు.దీనిపై తెలంగాణలో తీవ్ర చర్చలు నడిచాయి.ఇదిలా ఉంటే సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. వందరోజుల పాలనలో అనేకవిధాలుగా అవినీతికి పాల్పడ్డారని రేవంత్ లక్ష్యంగా ఆరోపణలు చేశారాయన. రేవంత్ సిఎం అయ్యాక నాలుగు నెలల పాటు కాంగ్రెస్ పాలనపై ఎలాంటి ఆవినీతి ఆరోపణలు రాలేదు.అయితే ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుండి యాంటీ రేవంత్ రెడ్డి బ్యాచ్ గా ముద్రపడింది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చింది మొదలు అసంతృప్తి రాగం తీశారు మహేశ్వర్‌రెడ్డి. రేవంత్ కి వ్యతిరేకంగా సీనియర్లతో చేతులు కలిపి ఢిల్లీకి ఫిర్యాదులు కూడా చేశారు.పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పంపించటంలో ఉన్న గ్రూపులో మహేశ్వర్‌రెడ్డి కూడా ఒకరు అన్నది అందరికీ తెలిసిందే.అప్పట్లో రేవంత్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే మెల్లమెల్లగా రేవంత్‌కి పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో సైలెంట్ అయిన మహేశ్వర్‌రెడ్డి ఇక హస్తం పార్టీలో ఉండలేనని నిర్ధారించుకుని బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో కమలం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆయన మళ్ళీ ఇప్పుడు రేంవత్ టార్గెట్‌గా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు.
ఢిల్లీకి సూటుకేసులు మోస్తున్నారంటూ కెటిఆర్ సహా పలువురు బిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయంగా చేసిన విమర్శలుగానే మిగిలాయి. కొంతకాలంగా ఏలేటి….. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంధిస్తున్న విమర్శలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కామెంట్ చేయటంతో పాటు ఏక్ నాథ్ షిండేలున్నారని, రేవంత్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు మహేశ్వర్‌రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి గ్రూపునకు 1500కోట్ల విలువ చేసే 15ఎకరాల స్థలాన్ని ఎకరం 2లక్షల చొప్పున కట్టబెట్టారని… దీనిపై అప్పుడు విమర్శించి, అధికారంలోకి రాగానే అదే భూమిని మళ్ళీ అదే కంపెనీకి ఇచ్చిందని సంచలన ఆరోపణ చేశారు. ఈ డీల్ తో దాదాపు 300కోట్లు చేతులు మారాయని, ఆ డబ్బునే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపారని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు అతి త్వరలోనే మరిన్ని ఆధారాలతో మరో అవినీతిని కూడా బయటపెడతానంటూ ఏలేటి చేసిన ఆరోపణలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.