ఆలూరు టీడీపీ వర్గపోరు కోట్ల కుటుంబానికి ఎసరుపెట్టనుందా

-

క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌మ్ముళ్లు అప్పుడే టిక్కెట్ పంచాయతీ మొదలు పెట్టారు. 2014ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో రెండు గ్రూపులుండగా కోట్ల కుటుంబం సైతం టీడీపీలో చేరడంతో వర్గపోరు ముదిరి పాకన పడింది. పార్టీలో ఉన్న రెండు వర్గాలను పక్కనపెట్టి కోట్ల సుజాతమ్మకు గత ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. వీరి వర్గపోరుతో సుజాతమ్మ సైతం ఓటమి పాలైంది. ఇదే అదునుగా భావిస్తున్న టీడీపీ పాత బ్యాచ్ నియోజకవర్గం నుంచి కోట్ల కుటుంబాన్ని సాగనంపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

2009 నుంచి ఆలురు టీడీపీలో వ‌ర్గ పోరు కొన‌సాగుతూనే ఉంది. అప్పట్లో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న వైకుంఠం మ‌ల్లికార్జున్ చౌద‌రి కుమారుడు వైకుంఠం ప్రసాద్ టికెట్ ఆశించారు. అప్పుడు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్దికి సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. 2014 ఎన్నిక‌ల స‌మ‌యానికి వైకుంఠం సైలెంట్ అయిపోవ‌డంతో ఇక్కడి సీటును సీనియ‌ర్ నాయ‌కుడు బ‌స‌న్న గౌడకు మారుడు వీర‌భ‌ద్ర గౌడ‌కు కేటాయించారు. ఆ ఎన్నిక‌ల్లో వీర‌భ‌ద్ర గౌడ ప‌రాజయం పాల‌య్యారు.

2019లో టిక్కెట్ పై ధీమాతో పార్టీని ముందుకు నడిపారు వీర‌భ‌ద్ర గౌడ‌. కాంగ్రెస్‌కు దూర‌మైన‌ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోట్ల సుజాత‌మ్మ దంప‌తులు గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో సుజాత‌మ్మకు 2019 ఎన్నిక‌ల్లో ఆలురు టికెట్ ఇచ్చారు. పొరుగున ఉన్న డోన్‌, ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం కోట్ల కుటుంబానికి పట్టుండటంతో తిరుగులేదనుకున్నారు. అయితే.. అప్పటి వ‌ర‌కు పార్టీని నిల‌బెట్టిన త‌మ‌ను కాద‌ని సుజాతమ్మకు టికెట్ ఎలా ఇస్తారంటూ వీర‌భ‌ద్ర గౌడ వ‌ర్గం సుజాత‌మ్మకు స‌హ‌క‌రించ‌లేదు. దీంతో గుమ్మనూరు జ‌య‌రామ్ వ‌ర‌సగా రెండోసారి విజ‌యం సాధించారు.

ఆలూరులో మళ్లీ కోట్ల కుటుంభానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని భావించిన వీర‌భ‌ద్ర గౌడ‌ వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తు కోట్ల కుటుంబాన్ని దూరం పెడుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సుజాత‌మ్మ త‌న వ‌ర్గాన్ని గెలిపించుకునేందుకు బాగానే క‌ష్టప‌డ్డారు. వీర‌భ‌ద్రగౌడ దూకుడు పెంచ‌డంతో ఇక్కడి టీడీపీ రాజ‌కీయాలు ఎటు మ‌లుపుతిరుగుతాయో అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news