బాధ్యత గల మంత్రులకు బాధ్యత గల శాఖలు ఉన్నప్పుడు బాధ్యతలు తప్పి మాట్లాడకూడదు. అసెంబ్లీ లో కాదు కదా మాట్లాడుతున్నది మీడియా ఎదుట ! ఓ ప్రతిష్టాత్మక శాఖ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కనీసం అధ్యయనం లేదు. లేకుండా మాట్లాడి ఆ రెండు మీడియాలను ఇదే సందర్భంలో టీడీపీని తిట్టడంతోనే ప్రెస్మీట్ అయిపోతే, కొత్త సర్కారు సాధించిందేంటని ?
కొత్తగా బాధ్యతలు అందుకున్న అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీటైల్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడూ మీడియా దగ్గర అనర్గళంగా మాట్లాడే వ్యక్తి చాలా విషయాల్లో తడబడ్డారు. తానేం ఇరిగేషన్ ఎక్స్పెర్ట్ ను కానని, కాంట్రాక్టర్ ను కూడా కానని ఆఖరికి తనని తాను సమర్థించుకుంటూ తప్పుకున్నారు. దీంతో విషయం కాస్త వైరల్ అవుతోంది. కొత్తగా బాధ్యతలు అందుకుంటున్న వారు మీడియా ఎదుట చెప్పే మాటలు చాలా హుందాగా విషయ అవగాహనకు లోబడి ఉండాలి కానీ ఇదేం పద్ధతి అంటూ విపక్షం విరుచుకుపడుతోంది.
వాస్తవానికి ప్రాజెక్టకు సంబంధించి సాంకేతిక పదజాలం ఏంటన్నది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ విషయమై అవగాహన లేదు అని తప్పులు మాట్లాడాక కాదు ముందే చెప్పాలి. నేనింకా పోలవరంను క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదు అని ! కానీ డయా ఫ్రం వాల్ గురించి నోటికి వచ్చిందంతా మాట్లాడితే ఇబ్బందులే ఎదుర్కోవాలి. ఎందుకంటే టెక్నికల్ టెర్మినాలజీ తెలియదు అని ఒప్పుకునే వరకూ ఆయనకు మీడియా ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. కనుక విషయావగాహన ఉండాలి అని అంటున్నాం ఇక్కడ.
ఇక గత ప్రభుత్వం చేసిన అవినీతి లేదా లంచగొండితనం వీటిపై ఎన్ని సార్లు మాట్లాడినా అవే కనుక కొత్తగా జగన్ సర్కారు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉండనే ఉంది. కేంద్రం కనుసన్నల్లోనే కదా ప్రాజెక్టు పనులు జరుగుతున్నది. అంటే ఓ తప్పుకు ఓ ఒప్పుకు రెండు ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యత లేదా సమిష్టి బాధ్యత వహించాల్సిందే ! ఈ చిన్న లాజిక్ ను మరిచిపోయి అంబటి మాట్లాడుతున్నారు. నీళ్లు నములుతున్నారు. అదే పనిగా ఆ రెండు మీడియాలపై కోపం అవుతున్నారు.
వాస్తవానికి పోలవరం రికార్డ్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి. నాలుగు వందల కోట్లకు పైగా అవినీతి అయిందనే ఒప్పుకుందాం. ఒకవేళ జరిగిందే అనుకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి కదా ! అలాంటివేవీ చేయకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు..? వాస్తవానికి ఆయనకు ఆ ప్రాజెక్టుపై అస్సలు అవగాహన లేదు అని తేలిపోయింది కనుక ఇప్పుడేం చేయాలో చూద్దాం. ముందుగా ఆయన నిపుణులతో మాట్లాడాలి. డయా ఫ్రం వాల్ ఎందుకు దెబ్బతింది ఎంత మేరుకు దెబ్బతింది అన్నది తెలుసుకోవాలి. అసలు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఎంతో కూడా ఆయనకు తెలియదనే తేలిపోయింది కనుక ముందు ప్రాథమికంగా సాంకేతిక పదజాలంపై సంబంధిత పదాలను ఉపయోగించే విధానంపై పట్టు సాధించాక మీడియాతో మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇస్తే మేలు.