ఏపీలో రెండ్రోజుల నడ్డా పర్యటన ముగిసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో నడ్డా వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా నడ్డా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలక పార్టీ వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీల మధ్య ఇప్పుడొక యుద్ధ వాతావరణం నెలకొంది. జగన్ ను ఉద్దేశిస్తూ కొన్ని కార్టూన్లను కూడా విడుదల చేసి, ఈ వైరం కాస్త పెంచి పెద్దది చేస్తోంది బీజేపీ.
తాజా పరిణామాల నేపథ్యంలో జగన్, బీజేపీ మధ్య దూరం మరింత పెరగనుంది. ఈ దూరం రాష్ట్ర ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపనుంది అన్న ఆందోళన ఒకటి అన్ని వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది.
ఇప్పటిదాకా రాష్ట్రం కోసం బీజేపీ చేసిన సాయం ఏమీ లేకపోయినా, కాస్తో కూస్తో అప్పుల వరకూ ఆర్బీఐ నిబంధనల మేరకు దక్కేలా మాత్రమే చేస్తోంది. ఇకపై రుణాల విషయమై ఇంకా ఆంక్షలు విధిస్తే ఏమౌతుందో అన్న ఆందోళన కూడా వైసీపీలో వ్యక్తం అవుతోంది. అదేవిధంగా తమను అదే పనిగా టార్గెట్ చేస్తూ పోవడం వల్ల ప్రజాకర్షణ కూడా తగ్గిపోతుంది అన్న భయం కూడా వైసీపీలో వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి ఎప్పటి నుంచో బీజేపీకి అత్యంత దగ్గరగానే జగన్ ఉన్నారు. ఇక్కడ కొంత విభేదం ఉన్నా, ఢిల్లీలో ఆయన తమలో ఒకరిగా కలిసిపోతారు అన్న భావన కూడా బీజేపీలో ఉంది.అయితే నడ్డా పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే ధ్యేయం అని తేలడంతో కొత్త శత్రువును తయారు చేసుకుని మరీ! ప్రజల ముంగిటకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బీజేపీ విమర్శలు ఓ విధంగా ఆ పార్టీకి మేలు చేయవు కానీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మిగతా విపక్ష పార్టీలకు సాయం అవుతాయి. అందుకే వైసీపీలో కలవరం మొదలైపోతోంది. అందుకే రోజా లాంటి లీడర్లు నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే పనిలో నిమగ్నం అయిపోయారు. ఒకవేళ రోజా కానీ ఇంకా ఇతర నాయకుల కానీ వాగ్ధాటితో బీజేపీపై దాడి చేస్తే అవి ఫలితం ఇస్తే, అప్పుడు మళ్లీ బీజేపీ సేఫ్ గేమ్ ఆడేందుకు ఇష్టపడుతుందో లేకా అర్ధంతరంగా ఆట ఆపేస్తుందో ? అన్నది ముందన్న కాలంలో తేలాల్సిన విషయం.