స్కిల్ స్కాం అంశంలో ఏపీ సీఐడీ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతోంది. ప్రధాన నిందితుడు నారా చంద్రబాబు నాయుడు కి బెయిల్ తిరస్కరించి విచారణకు సహకరించేలా ఆదేశాలను రాబట్టే విషయంలో తీవ్ర పోరాటం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు.. స్కిల్ స్కామ్ నగదు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరినట్టు కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పెర్కొంది. కానీ ఇది తొందరపాటు చర్య అని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో టీడీపీ నుంచి ఎవరూ ఇప్పటివరకూ దర్యాప్తునకు హాజరు కాలేదు.
సీఐడీ అడిగిన సమాచారం కూడా ఇవ్వలేదు. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు చెప్పినా కూడా టీడీపీ ఖాతాకు నగదు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేస్తుంది అని సీఐడీ మండిపడుతోంది. అంతేకాదు హోకోర్టు తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తూన్నారు సీఐడీ అధికారులు. దీంతోబాటు ఈ కేసులో చంద్రబాబును ఏరకంగా బాధ్యుడ్ని చేస్తారంటూ బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం అటు ప్రభుత్వాన్ని,ఇటు సీఐడీ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోర్టు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు చెప్తూ విరుద్ధంగా తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐడీ ఇద్దరూ…. ఈ కేసును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబుకి బెయిల్ మంజూరు కావడంపై ఆ పార్టీ ప్రతినిధులు సంబరాలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జైలు నుంచి ఇక రాడనుకున్న వ్యక్తి ఏదో అద్భుతం జరిగి తిరిగి వస్తే ఎంత ఆశ్చర్యానికి లోనవుతారో ఆ స్థాయిలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేయడం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. వీర తిలకాలు దిద్దడం, క్షీరాభిషేకాలు చేయడం వంటివి గమనిస్తే మొత్తానికి టీడీపీ శ్రేణులు….భలేవాళ్ళు సుమీ అనిపిస్తోంది. స్కిల్ స్కాములో అరెస్ట్ అయి ఇన్నాళ్లుగా జైల్లో ఉంటూ మొన్న ఈమధ్యనే అనారోగ్య కారణాలతో బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల కావడం తెలిసిందే.
అమాయకుడైన బాబును అరెస్ట్ చేశారని రోధిస్తూనే మరోవైపు ఘనంగా బెయిల్ వచ్చింది అంటూ న్యాయం గెలిచింది అనే హెడ్డింగులతో ప్రత్యేక కథనాలు వండి వార్చారు. కొంపదీసి బోలెడు యుద్ధాలు గెలిచిన బాజీ రావు వస్తున్నాడా అన్నట్టు టీడీపీ శ్రేణుల సంబరాలు సాగాయి. అవినీతి కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద వస్తున్న వ్యక్తికి ఈ స్థాయిలో హారతులు ఏంటని ఆ పార్టీలోని వారే ముక్కున వేలేసుకున్నారు.ఇన్నాళ్లుగా దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న పార్టీకి ఒక ముసలి దిక్కు లభించిందన్న ఆనందం తప్ప వాళ్ళ కళ్ళల్లో ఏమి కనిపించలేదనేది జగమెరిగిన సత్యం. అయన విడుదలతో ఒరిగింది ఏమీ లేదు.పార్టీకి మైలేజీ కూడా పెద్దగా వచ్చింది లేదు. అయన అవినీతికి పాల్పడలేదని కోర్టు కూడా చెప్పలేదు. మరి ఈ సంబరాలు దేనికి చేస్తున్నారో వారికే తెలియాలి.