ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కొత్త చిక్కులు తప్పేలా లేవు. జగన్మోహన్‌రెడ్డి తాను సీఎం అయిన వెంటనే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని ప్రకటించారు. తాజాగా జగన్ గవర్నర్ నరసింహాన్‌ను కలిసి కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చర్చించగా గర్నవర్ హరిభూషన్ సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిని ఎలా సరి చేయాలా ? అని తలమునకలు అవుతున్నారు.
కొన్ని మండలాలు రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అప్పుటు వాటిని ఎలా డివైడ్ చేయాలో తెలియని పరిస్ధితి. ఉదాహరణకు అనంతపురం మండలం అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో ఉంది. అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి ఉంది. అదే సమయంలో అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాల్లోనూ విస్తరించి ఉంది. అనంతపురం లోక్‌సభ పరిధిలో ఐదు, హిందూపురం పరిధిలో 15 గ్రామాలున్నాయి.
ఇక తిరుపతి అర్బన్ మండలం తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. ఇది తిరుపతి, చిత్తూరు లోక్‌సభ స్థానాల పరిధిలో ఉంది. ఇక విజయవాడ రూరల్ మండలం మైలవరం, గన్నవరం అసెంబ్లీ నియోజకవ ర్గాల పరిధిలోకి వస్తోంది. విజయవాడ లోక్‌సభ పరిధిలో 8, మచిలీపట్నం పరిధిలో 10 గ్రామాలున్నాయి. ఇక విజయవాడ పక్కనే ఉన్న గ్రామాలు మచిలీపట్నంలో కలపాల్సి ఉంటుంది. అటు పెనమలూరు నియోజకవర్గం విజయవాడను ఆనుకునే ఉన్నా మచిలీపట్నం జిల్లాలో కలపాలి.

ఇక విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి ఉంది. విశాఖ లోక్‌సభ పరిధిలో 1, అనకాపల్లి లోక్‌సభ పరిధిలో 3 ఊళ్లున్నాయి. ఇక విజయనగరం జిల్లాలోని జామి మండలం గజపతినగరం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లో ఉంది. విజయనగరం లోక్‌సభ పరిధిలో 12, విశాఖపట్నం లోక్‌సభ పరిధిలో 16 గ్రామాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తే గాని కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇక జనవరి 26 నుంచి ఏపీలో కొత్త జిల్లాల పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.