పదవుల కోసమే తెలంగాణ కాంగ్రెస్ లో చేరుతున్న నేతలకు బాంబ్ పేల్చింది ఏఐసీసీ. అసలు విషయమేమిటంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీలో నిబంధన పెట్టుకున్నట్టు న్యూస్ బయటికి వచ్చింది. ఇటీవల ఎక్కువ మంది బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం… ఆ వెంటనే పార్టీ ఖండువా మార్చుకోవడం జరిగిపోతున్నాయి.
మంత్రి పదవి ఆశించి వస్తున్న వారు కొందరైతే… కేబినెట్ ర్యాంక్ కి సమానమైన పదవి దొరక్క పోతుందా అనే ఆశతో వస్తున్నారు చాలామంది. అలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకున్న సీఎం రేవంత్ కి అక్కడి నేతలు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.దీంతో జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
మామూలుగా అయితే పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇచ్చి.. సామాజిక సమీకరణాలు కుదరని వారికి ఎలాగోలా సర్ది చెప్పుకుని రేవంత్ బయటపడేవారు. కానీ బీఆర్ఎస్‌ను బలహీనం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని చేర్చుకుంటూండటంతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి.
వాళ్ళకి పదవులు ఇవ్వరాదని ఏఐసీసీ తేల్చిచేప్పడంతో సీఎం రేవంత్ అంతర్మథనంలో పడ్డారు. ఇదే సమయంలో రేవంత్ పై పలు కారణాలతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎంపీగా ఓడిపోయినప్పటికీ దానం నాగేందర్ కు పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే జరిగితే ఇతర కాంగ్రెస్ నేతలు కొప్పడటం ఖాయం. అంతేకాదు కొంతమంది నేతల చేరికపైనా పార్టీలో అసంతృప్తి ఉంది. అన్నీ కలిపి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా మారుతూండంతోనే ఆయన మంత్రివర్గ విస్తరణ విషయాన్ని తాత్కలికంగా పక్కకు పెట్టేశారని సమాచారం.
జులై 7తో రేవంత్ రెడ్డి పీసీసీ టెన్యూర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్లతో పాటు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అయితే మంత్రి పదవి లేదా పీసీసీ చీఫ్ పోస్ట్ అయినా ఇవ్వాలంటూ కోరుతున్నారు.ఒకరికి రెండు పదవులు ఉండకూడదన్న నిబంధన ఉంది. కాబట్టి మంత్రులుగా ఉన్న వారికి పీసీసీలో పదవులు ఇవ్వరని క్లారిటీ వచ్చేసింది. తన టీం ని పీసీసీ లో పెట్టుకోవాలని రేవంత్ అనుకుంటున్న నేపథ్యంలో చాలామంది ఆయన అనుచరులు పదవులు ఆశిస్తున్నారు. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ వంటి పోస్టులు ఇవ్వలన్ని కోరుతున్నారు.