ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి వస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్ర హోం శాఖ కూడా స్పందించి అసదుద్దీన్ ఓవైసీకీ జెడ్ కేటగిరి భద్రతను కూడా కల్పించింది. తాజాగా ఈ దాడిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ స్పందించింది. యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి మీద జరిగిన కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరమైన విమర్శలు, ప్రతి విమర్శలకు చోటు ఉందే తప్ప ఇలాంటి భౌతిక దాడులకు చోటులేదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వం మీద ఉందన్నారు. జనాలను భయబ్రాంతులకు గురిచేయకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపవలసిందిగా ఎన్నికల సంఘాన్ని వైఎస్ షర్మిళ కోరారు. ఇది ఒక వ్యక్తిపై మాత్రమే జరిగిన దాడి కాదు, మైనారిటీలందరిపై జరిగిన దాడిగా పరిగణించాలని.. ఇలాంటివి ఎక్కడ జరిగినా మేము వాటిని ఖండిస్తాం. బాధితుల పక్షాన నిలబడుతాం అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
అసదుద్దీన్ పై దాడిని మైనారిటీలపై దాడిగా పరిగణించాలి.- వైఎస్ షర్మిళ
-