ఆగష్టు నెల వచ్చిందంటే తెలుగు రాష్ర్టాల్లో రాజకీయాలు ఉలిక్కిపడుతున్నాయి. సంవత్సరం మొత్తంలో 12 నెలలు ఉన్నా కేవలం ఆగష్టు అంటేనే రాజకీయాలు భయపడుతున్నాయి. ఎందుకంటే దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆగష్టు నెలలో రెండుసార్లు అన్న ఎన్టీఆర్ పదవీ గండాన్ని ఎదుర్కొన్నారు. అంతేకాదు చాలా సంఘటనలు ఆగష్టు నెలలోనే చోటుచేసుకున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా ఆగస్టు నెలలో ఏదో ఒకటి పొలిటికల్ డిస్టర్బెన్స్ వస్తుందని పలువురు పొలిటికల్ లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ గాసిప్ విపరీతంగా షికారు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌ని ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ తెగ హడావుడి చేస్తోంది. ఏమి జరుగుతుందా అని యావత్తు తెలంగాణ పొలిటికల్ రంగం ఆసక్తిగా చూస్తోంది.
ఉమ్మడి ఏపీలోఎన్టీఆర్ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆయన్ను ఆగస్టు నెల పదవీ గండంతో భయపెట్టింది. ఆగస్టు నెల వస్తే చాలు రాజకీయాల్లో ఏదో ఒక టాపిక్ హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ యాక్టివ్‌గా లేదు.కానీ ఆగస్టుపై గాసిప్ నడుస్తోంది. పదేళ్ళపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సైతం అడపదడపా ఆగష్టు అనుభవాలను ఎదుర్కొంది. అటు కాంగ్రెస్ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీయే అధికారంలో ఉంది. గత అనుభవాలకు బలం చేకూరుస్తూ మంత్రి కోటమరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
ఆగష్టు నెలలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది అని కోమటిరెడ్డి చెపడంతో రాజకీయాలు కలవరపాటుకి గురవుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కు పెట్టడంతో కొత్త చర్చలు ఊపందుకున్నాయి. రాష్ర్ట రాజకీయాల్లో ఆగష్టు నెలలో ఏం జరుగబోతోందంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నెలలోనే సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళుతుండగా ఆయన కుర్చీ లాగేస్తారా అని కామెంట్ చేస్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో పాలన వ్యవహారాలను తాను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడమే దానికి నిదర్శనమని వారు అంటున్నారు. ఇది ఆలోచించదగిన విషయమే అని మిగతా రాజకీయ పార్టీలు సైతం కామెంట్లు విసురుతున్నాయి.
సీఎం అందుబాటులో లేకపోతే పాలనవా వ్యవహారాలను డిప్యూటీసీఎం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ తెలంగాణలో డిప్యూటీసీఎంగా భట్టి విక్రమార్క ఉన్నారు. 12 రోజులపాటు సీఎం విదేశీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క ప్రభుత్వ వ్యవహారాలను నడిపించాలి. ఓవైపు ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే పాలనా పరమైన నిర్ణయాలు కూడా ఆయనే తీసుకోవాలి. అయితే సీఎం స్థానంలో తాను రాష్ట్ర రాజకీయాలను… పాలనా వ్యవహారాలను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం ఉండగా,మంత్రి కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కాంగ్రెస్‌లోనూ చర్చ జరుగుతోంది. సీఎంతో కోమటిరెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు.
అలాంటి వ్యాఖ్యలు చేయడానికి వారి మధ్య ఎలాంటి విబేధాలు కూడా లేవు. కోమటిరెడ్డి అసలు ఉద్దేశ్యం ఏంటో గానీ ఆయన చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ నేతలకు అవకాశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసేవిధంగా సరికొత్త రాజకీయ దుమారాన్ని తెరమీదకి తెచ్చారు. అసలే ఆగస్టు కావడంతో కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు… టైమ్ చూసి బీఆర్ఎస్ స్పందించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి మంత్రి కోమటిరెడ్డి మరో ఏక్‌నాథ్‌షిండేగా మారబోతున్నారని కామెంట్‌లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణలో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది.