నంద‌మూరి ఫ్యాన్స్‌లో బాల‌య్య అల్లుడి చిచ్చు

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి  పొలిటికల్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు సినిమా రంగంలో ఉన్న అసంఖ్యాకమైన అభిమానులు రాజకీయాల్లోనూ కొనసాగారు. ఇక ఎన్నో కులాలకు ఎన్టీఆర్ రాజకీయ, సామాజిక, ఆర్థిక అండదండలు అందించడంతో ఆ కుటుంబాలన్నీ దశాబ్దాలుగా తెలుగుదేశం వైపు ఉంటూ వస్తున్నాయి. తాజా ఎన్నికల్లో వీరిలో కొంత మార్పు వచ్చిన మాట నిజం.

ఇక ఎన్టీఆర్ అభిమానులు ఆ తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణకు… ఇప్పుడు డు ఆ ఫ్యామిలీలో మూడో తరం హీరో జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధంలో నందమూరి అభిమానుల్లో చీలిక‌ ఉందన్నది వాస్తవం. ఐదేళ్లపాటు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకేష్, బాలయ్య ఎన్టీఆర్‌ను వీలున్నప్పుడల్లా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. 2015 సంక్రాంతికి బాలయ్య నటించిన డిక్టేట‌ర్‌, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు దొరకకుండా చేయాల్సినంత రాజకీయం చేశారు.

హరికృష్ణ మృతి త‌ర్వాత ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర చేర్చుకున్న‌ట్టు బాల‌య్య‌, బాబు బిల్డ‌ప్ ఇచ్చినా అది అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే. ఆ త‌ర్వాత కూక‌ట్‌ప‌ల్లిలో స్వ‌యంగా సోద‌రి పోటీ చేసినా ఎన్టీఆర్ ప్ర‌చారం చేయ‌లేదు. ఇక తాజా ఎన్నిక‌ల‌కు ముందే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీలో చేరారు. తాజాగా ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య చిన్న అల్లుడు భ‌ర‌త్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలోనూ, నంద‌మూరి అభిమానుల్లోనూ తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ సేవ‌లు టీడీపీకి అవ‌స‌రం లేద‌ని తాను భావిస్తున్న‌ట్టు భ‌ర‌త్ చెప్పాడు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుంది.. ఆయనతోనే పార్టీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. కేవ‌లం ఎన్టీఆరే పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపుతాడ‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. ఎన్టీఆర్ చాలా పూచిక‌పుల్లలా తీసిప‌డేసేలా భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌లు నంద‌మూరి అభిమానుల్లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. అటు టీడీపీ కేడ‌ర్ కూడా భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్ప‌ప‌డుతున్నారు.

ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంతో చేశారని.. 2009 ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారం చేశార‌ని… ఇప్పుడు ఎన్టీఆర్‌ను త‌క్కువ చేసి మాట్లాడితే పార్టీకి మ‌రింత న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఫైర్ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌ను వ‌న్‌సైడ్‌గా స‌పోర్ట్ చేసే నందమూరి అభిమానులు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రెండుగా చీలి భ‌ర‌త్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తానికి ఇప్ప‌టికే రెండుగా ఉన్న నంద‌మూరి అభిమానులు ఇప్పుడు భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌తో సోష‌ల్ మీడియాలో ఒక‌రిని ఒక‌రు టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.