ఎం‌ఐ‌ఎంని బండి నిలువరిస్తారా..ఆ సత్తా ఉందా?

తెలంగాణలో బి‌జే‌పి దూకుడు ప్రదర్శిస్తోంది. ఊహించని విధంగా రాజకీయం చేస్తూ, టి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని అనుకుంటుంది. ఇప్పటికే టి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా వచ్చిన బి‌జే‌పి… పాతబస్తీలో ఎం‌ఐ‌ఎంని కూడా గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మత పరమైన విభేదాలు ఉన్న ఈ రెండు పార్టీలకు మొదట నుంచి పెద్దగా పడదు. ఎప్పటికప్పుడు ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉంటుంది. అటు బి‌జే‌పి సైతం, ఎం‌ఐ‌ఎం లక్ష్యంగా ఫైర్ అవుతూ ఉంటుంది.

bandi sanjay kumar aimim party

ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక మరింతగా రాజకీయం వేడెక్కింది. ప్రతి సందర్భంలోనూ బండి, ఎం‌ఐ‌ఎంని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. తాజాగా కూడా తన పాదయాత్రని ఎం‌ఐ‌ఎం అడ్డాగా ఉన్న పాతబస్తీలోనే మొదలుపెట్టారు. అది కూడా ఛార్మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ దగ్గర నుంచే మొదలుపెట్టి, ఎం‌ఐ‌ఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తాలిబన్ల పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. టి‌ఆర్‌ఎస్-ఎం‌ఐ‌ఎంలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. బి‌జే‌పి అధికారంలోకి రాగానే నిజాం ఆస్తులని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

ఇలా ఎప్పటికప్పుడు బండి, ఎం‌ఐ‌ఎంని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో పాతబస్తీలో ఎం‌ఐ‌ఎంని నిలువరించాలని బండి సంజయ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లోనే కొంతవరకు ఎం‌ఐ‌ఎంకు బి‌జే‌పి చెక్ పెట్టగలిగింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో పాతబస్తీలో కంచుకోటలుగా ఉన్న 7 స్థానాల్లో  ఎం‌ఐ‌ఎంకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు.

అయితే ఆ ఏడు స్థానాలు ఎప్పుడు ఎం‌ఐ‌ఎంకు అండగానే ఉంటాయి. ఇక్కడ మరో పార్టీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే టి‌ఆర్‌ఎస్ సైతం పాతబస్తీలో ఉన్న 7 స్థానాల్లో సీరియస్‌గా పోటీ చేయదు. వాటిల్లో ఓటమి ఖాయమనుకునే బరిలో దిగుతుంది. అలాంటిది బి‌జే‌పి, ఆ ఏడు స్థానాల్లో ఎం‌ఐ‌ఎంని ఎంతవరకు నిలువరించగలదో చూడాలి.