ఇటీవల కాలంలో తెలంగాణలో అధికార ఎమ్మెల్యేల్లో ఎక్కువ వివాదాస్పదం అవుతున్న ఎమ్మెల్యేల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఒకరు. ఈయనపై ఆరోపణలు మామూలుగా రావడం లేదు. పెద్ద ఎత్తున ఓ మహిళా లైంగిక ఆరోపణలు చేస్తుంది. ఈ అంశం చిన్నయ్యకు బాగా మైనస్ అవుతుంది. బెల్లంపల్లిలో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే స్థాయి వరకు వెళుతుంది.
చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని బెల్లంపల్లిలోని ఆరిజన్ డెయిరీ నిర్వాహకురాలు శేజల్ కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చిన్నయ్యపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు విన్నవించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమీపంలో ఆత్మహత్యా యత్నం చేశారు. తాజాగా అక్కడే నిరవధిక దీక్షకు దిగి, బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాకపోతే చిన్నయ్యపై ఎలాంటి చర్యలు లేవనే విమర్శలు ఉన్నాయి.
వాస్తవానికి అసలు ఏం జరిగిందంటే బెల్లంపల్లిలో ఆరిజన్ డెయిరీ ఏర్పాటు చేయాలని శేజల్ తదితరులు భావించారట. అందుకు ఎమ్మెల్యేను సంప్రదించగా, తన అనుచరులకు వాటా ఇస్తే.. రెండెకరాల భూమిని ప్లాంటు కోసం ఇస్తానని చిన్నయ్య చెప్పారని ఆమె ఆరోపించారు. కానీ తర్వాత ప్రభుత్వ భూమిని తమకు అంటగట్టినట్లు తెలిసిందని, ప్లాంటు విషయాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరచుగా వెళ్లాల్సి వచ్చేదని, ఆ క్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తాను అంగీకరించకపోవడంతో తనతో వచ్చిన అమ్మాయినైనా పంపాలని ఒత్తిడి చేశారని, చివరికి, వేరే అమ్మాయిలను పంపాల్సి వచ్చిందని శేజల్ వెల్లడించారు.
మరి ఇందులో వాస్తవాలు ఎంత వరకు ఉన్నాయి..ఇలా ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం తరుపున ఎలాంటి విచారణ లేకపోవడం, పోనీ శేజల్ ఆరోపణలు తప్పు అయితే..ఆమెని చట్ట పరంగా విచారించడం లాంటివి లేవు. ఈ అంశాలు అన్నీ చిన్నయ్యకు పెద్ద మైనస్ గా మారాయి. రాజకీయంగా చిక్కులు వచ్చేలా ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి వరుసగా గెలిచేశారు. కానీ ఈ సారి గెలుపు కష్టమయ్యేలా ఉంది.