స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వారు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి పార్టీ మారగా తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్దమయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. పార్టీలో కీలక పదవులు నిర్వహించారు బలరాం. ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన బలరాం పార్టీకి ప్రకాశం జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కి ఆయన దూరంగా ఉన్నారు. గొట్టిపాటి రవి కుమార్ ని పార్టీలోకి చేర్చుకున్న నాటి నుంచి ఆయన అసహనంగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఆయన జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కూడా చర్చలు జరిపారు. ఆయన తన కుమారుడు కరణం వెంకటేష్ తో కలిసి వైసీపీ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.