ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన… మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసుని సిబిఐ కి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్ కి ఒక రకంగా ఇబ్బందికర వార్తే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అసలు ఈ కేసు ముందు నుంచి ఆశ్చర్యమే. ఎటు నుంచి ఎటు తిరిగిందో… కూడా అర్ధం కాని పరిస్థితి.
హత్య జరిగిన వెంటనే అది గుండెపోటు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కట్లు కట్టడం దాన్ని మీడియా ఎక్కువగా హైలెట్ చేయడంతో దారుణ హత్య అనే విషయం బయటకు వచ్చింది. అసలు ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా కాస్త కంగారు పడ్డారు. చాలా మందికి ఎం జరిగిందో కూడా అర్ధం కాలేదు. అయితే ఆ తర్వాత వివేకా హత్య కేసుకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ కేసుని సిబిఐ కి అప్పగించాలని కోరారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఇదే అనుమానాలకు వేదికగా మారింది. జగన్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది ఎవరికి స్పష్టత లేదు. దీనిపై టీడీపీ నేరుగా వైఎస్ కుటుంబాన్నే దోషులు అంటూ విమర్శలు చేస్తుంది. రాజకీయంగా ఈ పరిణామం జగన్ కి ఇబ్బందే.
ఇప్పుడు కేసుని సిబిఐ కి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమైనా జగన్ సర్కార్ పై పెత్తనం చెలాయించే అవకాశాలు ఉన్నాయా అనేది చర్చలకు దారి తీస్తుంది. జగన్ ఒకప్పుడు డిమాండ్ చేసి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గి ఉంటారు అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఏ చిన్న తేడా వచ్చినా సరే జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానించడం గమనార్హం.