కమలంలో లక్కీ హ్యాండ్.. మునుగోడు లాగేస్తారా?

ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని దాటుకుని ఉపఎన్నికల్లో నెగ్గడం అనేది చాలా కష్టమైన పని. సాధారణంగా పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలైన… అలాగే మధ్యలో వచ్చే ఉపఎన్నికలైన సరే అధికార పార్టీకే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు అంటే…అధికారాన్ని ఏ స్థాయిలో వాడుకుని గెలుస్తాయో చెప్పాల్సిన పని లేదు…ఎవరు అధికారంలో ఉన్నా సరే అదే పద్దతి.

అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న బలమైన టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ చుక్కలు చూపిస్తూ వస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ని మట్టికరిపించి కమలం పార్టీ గెలిచింది. ఇక రాబోయే మునుగోడు ఉపఎన్నికలో కూడా సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. ఇలా బీజేపీ వరుసగా మంచి విజయాలు సాధించడం వెనుక కారణాలు లేకపోలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరగడం..అదే సమయంలో బీజేపీకి ప్రజాదరణ పెరగడం.

అలాగే బీజేపీ గెలుపు కోసం పలువురు బడా నేతలు…తమదైన శైలిలో వ్యూహాలు రచించి పార్టీని గెలిపిస్తున్నారు. అలాగే పార్టీలో కీలకంగా పనిచేసేవారిలో మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి ఉంటారని చెప్పొచ్చు. వీరు పైకి హడావిడిగా కనిపించరు గాని…గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం గట్టిగానే స్కెచ్ లు వేస్తూ ఉంటారు. ఆర్ధిక, అంగ బలం విషయంలో వివేక్…బీజేపీకి ఫుల్ సపోర్ట్.

ఇక ఏదైనా బాధ్యత అప్పగిస్తే సక్రమంగా నిర్వర్తించి పార్టీని గెలిపించడంలో జితేందర్ రెడ్డి ధిట్ట. వాస్తవానికి జితేందర్ రెడ్డి..ఇప్పుడు కమలం పార్టీలో లక్కీ హ్యాండ్ గా ఉన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలకు ఈయనే ఇంచార్జ్ గా పనిచేశారు. ఆ రెండుచోట్ల పార్టీ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు మునుగోడులో గెలుపు కోసం పార్టీలో పలు కమిటీలు వేయనున్నారు. అయితే ఇంచార్జ్ బాధ్యత మాత్రం లక్కీ హ్యాండ్ జితేందర్ రెడ్డికి అప్పగించాలని డిమాండ్ వస్తుంది. ఎక్కువ శాతం మునుగోడు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి.