హ్యాట్రిక్ కొట్టి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం పీఠాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతాపార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. అలాగే రాజ్యసభలోనూ సంఖ్యాబలం పెంచుకుని బిల్లుల ఆమోదానికి అడ్డులేకుండా ఉండేలా వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 93, మొత్తంగా ఎన్‌డీఏ కూటమికి 114 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ కోటాలో జరగుతున్న ఈ రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సీట్ల పరంగా బలం పెరగనుంది. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
పెద్దల సభలో కీలక బిల్లుల ఆమోదానికి అడ్డంకులు లేకుండా ఉండేలా కసరత్తులు చేస్తోంది బీజేపీ. ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది.56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు తుది గడవు ఫిబ్రవరి 15…ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన , ఫిబ్రవరి 20 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. పెద్దలసభ ఖాళీ స్థానాలకు పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. ఫలితాలను కూడా అదే రోజు ప్రటించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలు కాళీ అవుతుండగా ఏపీలో మూడు, తెలంగాణలో మూడు సీట్లు భర్తీ కానున్నాయి.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ర్టాలలో గెలిచింది. అత్యధికంగా సీట్లు సాధించి ఏకపక్షంగా ఆయా రాష్ర్టాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో మధ్యప్రదేశ్ రాష్ర్టానికి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతుంది. ఈ నాలుగు స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది. ఇక చత్తీస్ గఢ్‌లో ఉన్న ఒక స్థానం బీజేపీ కైవసం కానుంది. రాజస్థాన్‌లో గతంలో బీజేపీకి ఒకే ఒక రాజ్యసభ సీటు ఉండేది. తాజాగా రాజస్థాన్‌లో ఎన్నికలు జరగుబోయే మూడు స్థానాల్లో బీజేపీ రెండింటిని గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మూడు రాష్ర్టాల నుంచి మరో 6 రాజ్యసభ స్థానాలు బీజేపీ ఖాతాలోకి చేరనున్నాయి. బీహార్‌లో జెడీయూతో జతకట్టిన బీజేపీ అక్కడ కూడా రెండు స్థానాలను గెలుచుకోనుంది. మొత్తంగా 56 స్థానాలలో సగానికిపైగా సొంతం చేసుకునేలా బీజేపీ కసరత్తు చేస్తోంది.