ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, ఏదైనా విషయంపై రీకౌంటర్ వేయాలంటే… ముందుగా ఎదుటివ్యక్తి చెప్పిన ప్రతీ విషయం క్షుణ్ణంగా విని, పరిశీలించి అనంతరం సామన్యులకు సైతం అర్ధమయ్యేలా ప్రతిస్పందించాలి. ఇది హుందా అయిన రాజకీయం! ఈ విషయం మరిచి ఎలాబడితే అలా వాగేవారిని, వాదించేవారిని ఏమనాలి? ప్రస్తుతానికి బోండా ఉమ అందాం అంటున్నారు ఏపీ వాసులు! ముఖ్యమంత్రి ఏమి మాట్లాడారు, తాను ఏమి మాట్లాడుతున్నాను అనే ఆలోచన ఏమాత్రం చేయరు! మైకు నోటి ముందు పెట్టడమే ఆలస్యం… కీ ఇచ్చిన బొమ్మలా ఆ మైకు తీసేవరకూ ఆ నోరు ఆడుతూనే ఉంటాది! అందుకు తాజా ఉదాహరణ ఏమిటో తెలుసుకుందాం!
తాజాగా ప్రజలకు సందేశమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కరోనా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఎప్పుడూ ఉండదని.. కరోనా తనతో సహా ఎవరికైనా రావచ్చని.. రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుందని.. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అని అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది.. ఎవరికి వస్తుందో తెలియటం కష్టం.. సామాజిక దూరం పాటించడం అవసరం.. ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి రోగ నిరోధకశక్తిని పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవాలి అని అన్నారు.
ఈ విషయాలు జనాలందరికీ ఒకలా అర్ధం అయితే… టీడీపీ నేతలకు, ముఖ్యంగా బోండా ఉమకు మరోలా అర్ధం అయినట్లుంది! ప్రజలు కరోనాకు దూరంగా ఉండాలని కోరుకుంటుంటే.. జగన్ మాత్రం జీవితాంతం కరోనాతో కలిసి ఉండాలని అంటున్నారని బోండా ఉమ చెబుతున్నారు. అసమర్థ సీఎం అని మరోసారి జగన్ నిరూపించుకున్నారని.. ఏపీలో కరోనా టెస్టులు చేయడంలేదని ఆయన ఆరోపించారు. ఒక్కసారి ఈ మాటలకు ఇప్పటికే అందిన సమాధానాలను ఒకసారి పరిశీలిద్దాం!
మొదటిది… ప్రజలు కరోనాకు దూరంగా ఉండాలని కోరుకుంటుంటే… జగన్ కరోనాతో జీవించాలని అంటున్నారని! గతేడాది డిసెంబర్ నెలలో.. అటాక్ అయిన కరోనా వైరస్.. ప్రతి ఏటా అదే సీజన్ లో దాడి చేసేందుకు అవకాశం ఉందని ఒకపక్క సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలోని వైరస్ కణాలు.. ఏదో ఒక విధంగా నిద్రాణమై ఉంటాయనీ.. అయితే, అవి ఆ వింటర్ సీజన్ లో మళ్లీ ఉత్తేజమై వైరస్ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుందని చైనాకు చెందిన ఏపెక్స్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పాతొజెన్ బయాలజీ విభాగం చెబుతుంది. ఇదే విషయంపై… కరోనా వైరస్ ప్రస్తుతానికి నాశనం అయినా.. సీజన్ల ప్రకారం అది మళ్లీ దాడి చేసేందుకు అవకాశం ఉంటుందని గతంలో పలువురు అమెరికా సైంటిస్టులు కూడా చెప్పిన సంగతులు తెలిసినవే. ఇదే విషయాన్ని జగన్ ప్రస్థావిస్తే…. సైంటిస్టులను ఏమీ అనలేక, జనాలను ఎడ్యుకేట్ చేస్తున్న జగన్ పై వీరంతా నోరు పారేసుకుంటున్నారు.
ఇదే క్రమంలో బోండా వారు వదిలిన మరో జ్ఞాన బాణం… ఏపీలో కరోనా టెస్టులు చేయడం లేదని! భారతదేశంలో కరోనా టెస్టులు అధికంగా చేస్తున్న రాష్ట్రం ఏపీ అని దేశం అంతా మొత్తుకుంటుంటే… వీరికి కళ్లు బైర్లు కమ్మడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు వెర్రి వాళ్లు అనుకునే ఇలాంటి టీడీపీ నేతలు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అయినా మారతారని నమ్మిక సగటు టీడీపీ కార్యకర్తకు నిరాశ తప్పడం లేదు!