బొత్స ఇంట్లో ఆధిపత్యపోరు పీక్స్ కి చేరిందా ?

Join Our Community
follow manalokam on social media

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స కుటుంబానికి.. ఇంటిపోరు పంచాయితీ ఇరుకున పెడుతోందట. ఇన్నాళ్లూ ఒకే మాటపై నడిచిన బొత్స కుటుంబ సభ్యులు ఇప్పుడిలా ప్రత్యర్థుల్లా మారిపోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది..రాష్ట్రంలో అనే సమస్యలను పరిష్కరించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారా అన్న చర్చ విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకిత్తిస్తుంది.

విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబానిదే కీలకపాత్ర. జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యం ఉంది. గతంలో పెన్మత్స సాంబశివరాజు, పతివాడ నారాయణస్వామి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 2009లో బొత్స సత్యానారాయణతో రాజకీయ విభేదాల కారణంగా సాంబశివరాజు కుటుంబం పోటీకి దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుడు బడ్డుకొండ అప్పలనాయుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో బొత్స అండ్‌ కో వైసీపీలో చేరినా ఆ ఏన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో వైసీపీ నుంచి మరోసారి నెల్లిమర్ల నుంచి గెలిచారు అప్పలనాయుడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ నియోజకవర్గంలో బొత్స సోదరుడు లక్ష్మణరావు జోక్యం పెరిగిందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది.

వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెండు వర్గాలు పావులు కదుపుతుండటంతో రాజకీయం వేడెక్కుతోంది. లక్ష్మణరావు తన కుమారుడు బొత్స చైతన్యను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలని ఆలోచనిస్తున్నారట. నెల్లిమర్ల వ్యాప్తంగా చైతన్య బ్యానర్లు ఏర్పాటు కావడం చర్చకు దారితీసింది. ఇది స్థానికంగా ఎమ్మెల్యే అప్పలనాయుడికి ఇబ్బందిగా మారిందట. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో అప్పలనాయుడు, లక్ష్మణరావుల మధ్య మరోసారి అగ్గిరాజుకున్నట్టు సమాచారం. బంధువులే అయినా.. ఈ మధ్య ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. వైరిపక్షాల మాదిరి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఇద్దరు నాయకులు.

టీడీపీ నేతలతో కలిసి ఏకగ్రీవాలను అడ్డుకుంటున్నారని లక్ష్మణరావుపై ఆరోపణలు చేశారు అప్పలనాయుడు. బొత్సాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నది ఎమ్మెల్యే విమర్శ. అందుకే ఇప్పుడు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పడంతో సమస్య ముదిరి పాకాన పడినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇన్నాళ్లూ ఒకే మాటపై నడిచిన బొత్స కుటుంబ సభ్యులు ఇప్పుడిలా ప్రత్యర్థుల్లా మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పెద్దాయనపై గౌరవంతో కామ్‌గా ఉన్న ప్రతిఒక్కరూ ఓపెన్‌గా కామెంట్స్‌ చేసుకోవడం పార్టీ కేడర్‌కు కూడా మింగుడుపడటం లేదట. వారసుల కోసం రోడ్డెక్కేందుకు ఎంతదూరమైనా వెళ్తామన్న పట్టుదల లోకల్‌ లీడర్స్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం అందరి చూపూ బొత్సపైనే ఉంది. ఆయన ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది పార్టీ కేడర్‌.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....