అసలు చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్తితి అంతంత మాత్రమే..పేరుకు చంద్రబాబు సొంత జిల్లా అయిన సరే అక్కడ వైసీపీదే హవా…గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది…జిల్లాలో ఉన్న 14 సీట్లకు 13 గెలుచుకుంది…ఒక కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో కూడా వైసీపీ బలం పుంజుకుంటుంది…అంటే టోటల్ గా జిల్లాపై వైసీపీ పట్టు పెంచుకుంది. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలతోనే…చిత్తూరులో వైసీపీ ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు.
అయితే వైసీపీ హవా తగ్గించి టీడీపీని పైకి లేపాలని చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు…వీలు దొరికినప్పుడల్లా చిత్తూరుకు వస్తున్నారు…తాజాగా కూడా ఆయన చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. మదనపల్లెలో మినీ మహానాడు నిర్వహించారు. అది బాగానే సక్సెస్ అయింది. ఇక తర్వాత రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఏడు స్థానాల్లో ఐదు ఐదు స్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు రాలేదు..కానీ పుంగనూరు, తంబళ్ళపల్లె స్థానాల్లోనే రచ్చ జరిగింది. ఈ రెండు స్థానాల్లోనే టీడీపీ నేతలు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఇక ఈ గ్రూపు తగాదాలు తాజాగా చంద్రబాబు ముందే బయటపడ్డాయి. ఏకంగా బాబు ముందే పుంగనూరు తమ్ముళ్ళు కొట్టుకున్నారు. అటు తంబళ్ళపల్లె నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా రచ్చ చేశారు.
అసలే ఈ రెండు స్థానాలు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి…పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. ఈ రెండు చోట్ల టీడీపీకి పెద్ద బలం లేదు. అలాంటప్పుడు నేతలు కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుంది…కానీ ఇలా కుమ్ములాటల వల్ల పెద్దిరెడ్డి ఫ్యామిలికే ప్లస్ అయ్యేలా ఉంది. ఇలాగే రచ్చ కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు చోట్ల టీడీపీ గెలవడం కష్టమే.