బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న వలసలు… పార్టీని వీడడానికి కారణం అదేనా?

-

అధికారం ఉన్నప్పుడు రాజు.. అధికారం పోయాక బికారి అన్నట్లు… అధికారం ఉన్నంతా కాలం మనకు జపం చేసిన వాడే.. అధికారం పోయాక విమర్శలు చేశారు. అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా నోరుమూసుకోని ఉన్నవాడు .. పవర్ లేకపోతే ప్రత్యర్థిగా మారిపోతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత జపం చేసిన నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ కండువా మార్చేస్తున్నారు.

brs party
brs party

ఇన్నాళ్లు తన మాటే శాసనంగా పార్టీని నడిపించిన గులాబీ బాస్.. ఇప్పుడు వలసలను ఆపలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బతిమాలి జాయిన్ అయిన నేతలు.. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా బుజ్జగించినా, బతిమాలినా వినకుండా తమదారి తాము చూసుకుంటున్నారు. ఎప్పుడు ఏ నేత జంప్‌ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ వలసలు ఎప్పటివరకు కొనసాగుతాయోనని బీఆర్ఎస్‌ను కలవరపెడుతోంది.

దేశ్ కి నేతగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి తెలంగాణలోనే రాజకీయం చేయలేకపోతున్నారు. కనీసం లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ పరువు కాపాడుకునేలా, క్యాడర్‌లో ధైర్యం నింపేలా ఎంపీ సీట్లను గెలుచుకోవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు.

బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో తన వాళ్ళు ఎవరో.. పరాయి వాళ్ళు ఎవరో అర్థం చేసుకోలేక కేసీఆర్ అయోమయంలో పడిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల జంపింగ్‌ బీఆర్ఎస్ పార్టీని, నేతలను నిరాశ పరుస్తోంది. ఎవరెళ్లినా పర్లేదని దీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికారం కోల్పోగానే నేతలు పార్టీని వదులుతుండటం కలవరపెడుతోంది.

ఆఖరికి బీఆర్ఎస్‌లో తన తర్వాత అంతటి స్థానం కల్పించి గౌరవించిన కే కేశవరావు లాంటి నేతలు కూడా పార్టీని వీడటం కేసీఆర్ ఊహించని పరిణామమని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు.

ముఖ్యనేతలే కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ నేతలు వలసల బాట పట్టడం గులాబీబాస్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి పార్టీలోని నేతలకు, క్యార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీని ముందుకు నడిపించడానికి గులాబీ బాస్ ఏం చేస్తారన్నదే రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే అధికారం కోసమే నేతలంతా పార్టీని వీడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news