టీడీపీలోని కాపు నేతల కదలికలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాపు నేతలు సమావేశాలమీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లోని ఆంతర్యం మాత్రం ఎవ్వరికీ అంత సులభంగా అంతుచిక్కడం లేదు.. అంతర్గతంగా ఏం చర్చించుకుంటున్నారో తెలియడం లేదుగానీ.. బయటకు మాత్రం..ఆ.. ఇందులో రాజకీయ అంశాలపై చర్చించలేదని చెప్పేస్తున్నారు. ప్రధానంగా కాపులు టీడీపీపై కొంత ఆగ్రహంతో ఉన్నారన్నది మాత్రం నిజమే.
2104 ఎన్నికల్లో తాము అండగా ఉండడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, కానీ తమను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదన్న కోపం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 2019 ఎన్నికలో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో టీడీపీలోని కాపు నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవడంపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఉండాలా వద్దా.. అన్నదే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా.. విశాఖ జిల్లాలో కాపు నేతలు మరోమారు సమావేశం నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశానికి టీడీపీకి రాజీనామా చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల రాజా కూడా వచ్చారు. ఆయనతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులు, ఇతర నాయకులు కూడా హాజరయ్యారు. అంతేగాకుండా.. బీజేపీలో చేరుతారని ప్రచారంలో ఉన్న విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు కూడా ఈ సమావేశానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఈ సమావేశంలో ఏం చర్చించారో తెలియదుగానీ.. కాపుల ఐక్యతను చాటుతూ కీలక నిర్ణయం తీసుకునే దిశగా మాత్రం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ కొనసాగడం ఏమాత్రమూ మంచిది కాదని, తమ రాజకీయ భవిష్యత్ కోసం మరో పార్టీలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్న వాదన బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే.. టీడీపీ కాపు నేతలు వైసీపీలోకి వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదట. ఎందుకంటే.. కాపుల డిమాండ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగా లేరన్నది స్పష్టమే.
ఇక బీజేపీలోకి వెళ్దామన్నా.. ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం ఉనికిపాట్లు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీలోకి వెళ్తే.. మరింత నష్టమే తప్ప లాభం ఉండదని టీడీపీ కాపు నేతులు అనుకుంటున్నట్లు సమాచారం. మరో సమావేశంలోనైనా.. ఓ నిర్ణయానిక వస్తారో లేదో చూడాలి మరి.