కేసీఆర్ వర్సెస్ కేంద్రం.. టీఆర్‌ఎస్‌తో తాడోపేడో తేల్చుకోనున్న బీజేపీ

-

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడేండ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి కూడా అంతేకాలం అవుతున్నది. పైకి ఉప్పు నిప్పులా కనిపించినా ఇన్నేండ్లు ఇరు పార్టీలు సర్దుబాటు ధోరణితో వెళ్లాయి. పార్లమెంట్‌లో బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ సహకరిస్తూ వచ్చింది. అలాగే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం విమర్శలు గుప్పించినా కేంద్ర మంత్రులు పొగడ్తలతో ముంచెత్తి వెళ్లేవారు. ఏదైనా అనుమతులు కావాలన్నా చకచకా వచ్చేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. వరుసగా రెండు రోజులు ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రంపై ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం సైతం గట్టి కౌంటర్ ఇవ్వడానికే సిద్ధమైనట్లు తెలుస్తున్నది. పరిస్థితిని బట్టి చూస్తే టీఆర్‌ఎస్‌తో కేంద్రం తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

రెండు రోజుల వరుస ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వరి కొనుగోలు, రైతుల విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. జల వివాదాలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. కీలక రంగాల్లో విఫలమైందంటూ విమర్శలు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇకపై ఊపేక్షించేది లేదని బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా బదులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

అందుకే, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఢిల్లీలో ప్రెస్‌మీట్ వేదికగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకోవడంలో ఆలస్యం చేసి తమను తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో ప్రెస్‌మీట్ పెట్టి మరి కేంద్ర జల్ శక్తి మంత్రి కౌంటర్ ఇవ్వడమంటే టీఆర్‌ఎస్‌తో కేంద్రం తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సైతం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

మరోవైపు బండి సంజయ్‌కు బీజేపీ అధిష్ఠానం పూర్తి మద్దతు ఉన్నట్లు తెలుస్తున్నది. ఏదైనా సరే ముందుకు వెళ్లాలని, కేంద్ర, పార్టీ అధిష్ఠానం మీ వెంట ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. బీజేపీ అధిష్ఠానం, కేంద్రం సంపూర్ణ మద్దతు లభించడంతో రాష్ట్రంలో మరింత దూకుడుగా, టీఆర్‌ఎస్‌తో అమీతుమీ తేల్చుకునేలా ముందుకు సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news