నేను ఎవరికీ భయపడను.. నన్నెవరకు భయపెట్టలేరు.. బాంబులకే భయపడలేదు.. ఎవరికీ భయపడేది లేదు.. ఇదీ తరచూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాట. అయితే ఇప్పుడు భారీ స్కామ్ లో చిక్కుకోవడంతో ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ దొరకని చంద్రబాబు ఈసారి ఐటీ శాఖకు అడ్డంగా దొరికిపోయారు. అందుకేనేమో తనను అరెస్ట్ చేస్తారనే ముందుగానే చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దేనికీ భయపడను అంటున్న వ్యక్తి, చివరికి నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ భయపడుతూ చెబుతున్నట్లుగా ఉంది. దీన్ని ఏరకంగా తీసుకోవాలి. భయపడుతున్నట్లా ? భయపడడం లేదన్నట్లా?
గతంలో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు కు నోటు కేసు విషయంలో ప్రధాన సూత్రదారుడని తేలింది. జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపించింది. కానీ ఈ కేసులో బాబు మినహా మిగిలిన వారు ఇరుక్కున్నారు. ఎలాగోలా చంద్రబాబు మిస్ అయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఓటు కు నోటు కేసులో తనను అరెస్ట్ చేస్తారేమో అనే మాట చంద్రబాబు నోటి వెంట రాలేదు. కానీ ఈసారి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ 118 కోట్లు ముడుపులు తీసుకున్నారనే అభియోలతో చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది.
చంద్రబాబు ఈ కుభకోణంలో ఇరుక్కోవడంతో వైసీపీ ముట్టేట దాడి చేస్తోంది. టీడీపీ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలకు గాను ఇప్పటికే ఈడీ ఆయనను విచారించి అరెస్ట్ చేయాల్సిందని, కానీ ఇంతకాలం చూస్తూ ఎందుకు ఊరుకుందో అర్థం కావడం లేదని ఆ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం పండినప్పుడు శిక్ష తప్పదని కాస్త ఆలస్యంగా చంద్రబాబు తెలుసుకున్నారో ఏమో… ఇప్పుడు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. నిప్పులా బతికిన తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయంగా మారింది. మొత్తానికి చంద్రబాబు పైకి భయపడడం లేదంటూనే, లోలోపల భయపడుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు అర్ధమవుతోంది.