అవును.. ఏపీ మాజీ సీఎం ఏపీవాళ్లు కూడా తెలంగాణను ఫాలో అవ్వాలని పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ప్రజాసమస్యలపై పోరాడే విషయంలో.. అవును.. తెలంగాణలో ఆర్‌టిసి సమస్యపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఏపీలోనూ అదే తరహాలో ఇసుక సమస్యపై పోరాడాలంటున్నారు చంద్రబాబు.
ఇసుక కొరత వల్ల నష్టపోతున్న 125 వృత్తుల వారు అంతా కలసి ఉద్యమం చేయాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. అందుకే తాను ఈ నెల 14న తలపెట్టిన దీక్షకు వీరంతా తరలిరావాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఏపీ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని మార్చటంవల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృత్రిమ కొరత ఏర్పడిందని చంద్రబాబు మండిపడ్డారు.
దాదాపు .. 30 లక్షల మంది కార్మికులను, ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించారని చంద్రబాబు తన లేఖలో దుయ్యబట్టారు. పనులు లేక చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేక అర్ధాంతరంగా కొందరు చదువులు ఆపేయించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. భార్యా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని మొత్తం 40 మందికి బలవన్మరణాల పాలయ్యారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
ఇసుక కృత్రిమ కొరతతో పెరిగిన రేట్ల వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందని మాజీ సీఎం విమర్శించారు. పనులు కోల్పోయిన 125 వృత్తులవారందరీకి మనో ధైర్యం కలిగించి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలు చేయాలని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నవంబర్ 14న 12 గంటలు నిరసన దీక్షను చేపడుతున్నానని చంద్రబాబు తెలిపారు. పని చూపే వరకు కార్మికులకు 10 వేల రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.