చంద్రబాబు కొత్త ప్యూహం ఫలిస్తుందా ?

-

చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయం మొదలెట్టారు.ఏపీలో రాజకీయాలు కులం నుంచి మతం వైపు టర్న్ అవుతున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కులం విషయంలో వైసీపీ, టీడీపీ బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నాయి. అటు సీఎం…ఇటు మాజీ సీఎం ఈ అంశంలో చాలా దూరమే వెళ్లిపోయారు. ఇప్పుడు కులం నుంచి మతం వైపు రాజకీయ పయనం మొదలైంది. ఎప్పుడు టచ్ చేయని మతాల విషయాన్ని స్వయంగా చంద్రబాబు ఎందుకు ఎత్తుకున్నారు. చంద్రబాబు కొత్త ప్యూహం ఫలిస్తుందా..పార్టీ నేతలను ఈ అంశం ఆందోళనకు గురి చేస్తుందట….

దేవాలయాల్లో విగ్రహాల ద్వంసంపై ప్రారంభమైన నిరసనలు.. మతం లోతులను టచ్ చేస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు ప్రభుత్వ పెద్దల మతం గురించి తెచ్చిన ప్రస్తావన ఇంటా బయటా తీవ్ర చర్చకు కారణం అవుతుంది. పార్టీలో సుదీర్ఘంగా చర్చ లేకుండా విధాన పరమైన అంశాలపై బాబు మాట్లాడింది లేదు. అయినప్పటికీ మత రాజకీయల విషయంలో ఆయన కొంత దూకుడుగా వెళ్లినట్టు పార్టీలో వినిపిస్తున్న మాట. టీడీపీలో చర్చ లేకుండా.. పెద్దగా ఫీడ్ బ్యాక్ తీసుకోకుండానే చంద్రబాబు క్రిస్టియన్ మతం, సెంటిమెంట్, మత మార్పిడులు అంటూ మాట్లాడటం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురి చేస్తుందట…

హిందూ దేవాలయాల పై దాడులు గురించి టీడీపీ ఉద్యమం విషయంలో అంతా ఒకే అనుకున్నా..దీన్ని అక్కడికే పరిమితం చెయ్యాలని.. వేరే మతాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సిందని ఎక్కువ మంది సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారట. రానున్న రోజుల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందో వారు భయపడుతున్నట్టు సమాచారం. పై స్థాయిలో కొంత కసరత్తు తరువాతనే చంద్రబాబు.. మతపరమైన అంశాలపై మాట్లాడారు అనేది కొందరు చెబుతున్న మాట. హిందూమతం విషయంలో ఇప్పుడు స్పీడుగా లేకపోతే.. బీజేపీ చొరబడుతుందని టీడీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట.

రామతీర్థం ఘటన తరువాత అధినేత స్పీచ్‌లో ఘాటు వ్యాఖ్యల వెనక అదే వ్యూహం ఉందని వారు చెపుతున్నారు. తిరుపతి బైపోల్స్ ముందు మరీ ఎక్కవ లెక్కలు వేసుకుని.. మడి కట్టుకుని కూర్చుంటే కుదరదని పార్టీ ముఖ్యులు ఒక నిర్ణయానికి వచ్చారట. దానిలో బాగంగానే అజెండా ఫిక్స్ చేసే ఛాన్స్‌ కమలనాథులకు ఇవ్వకుండా బాబు ఆ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. ఎప్పటికప్పడు అంశాలపై పోరాటం చెయ్యడం ఒకటైతే.. బీజేపీకి అవకాశం రాకుండా చూడటం టీడీపీ వ్యూహంలో భాగమట.

రామతీర్థంతోపాటు దేవాలయాల విషయంలో కేవలం అక్కడి వరకే పరిమితమైతే పోయేది అనే కొందరు నేతల వాదనను టీడీపీ పెద్దలు కొట్టిపారేస్తున్నారు. కొన్నివర్గాలపట్ల సానుకూలంగా ఉన్నా రాజకీయంగా కలిసి వచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని.. అటో ఇటో తేల్చుకోకపోతే రాజకీయంగా మరింత నష్టపోతమన్నది వారి అంచనా. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా చంద్రబాబే ఈ విషయంలో కాస్త లోతైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బాబు వ్యాఖ్యల వెనక దీర్ఘకాలిక ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోందని ఒక విశ్లేషణ. ఎలాగూ ఆ వర్గాల ఓట్లు ఇక తమకు రావనే నిర్ణయంతోనే ఇలా ఫిక్స్‌ అయినట్టు చెబుతున్నారు.

అయితే స్వయంగా పార్టీ అధినేత కాకుండా పార్టీ నేతలతో ఆ విషయంపై మాట్లాడిస్తే సరిపోయేదని కొందరి వాదన. ఆయా వర్గాలు తమకు ఓటు వేయవనే నిర్ణయానికి రావడాన్ని తప్పు పడుతున్నారు. అన్ని అంశాలను ఓట్ల దృష్టిలోనే చూడలేమని..ఓవరాల్ ఇమేజ్.. ఇంపాక్ట్ కూడా లెక్కలు వేసుకోవాలని చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తిరుపతి ఉపఎన్నిక, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం వరకు ఉపయోగపడ వచ్చని.. అయితే లాంగ్‌రన్‌లో ఈ వ్యాఖ్యలు తమకు ఇబ్బందులు సృష్టిస్తాయని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు.

ప్రత్యకహోదా విషయంలో తమ ప్రభుత్వ, పార్టీ లైన్ తరువాత కాలంలో తమకు ఎలా ఇరకాటంగా మారిందో గుర్తు తెచ్చుకోవాలన్నది పార్టీ నేతల మాట. అత్యంత సున్నితమైన విషయాల్లో మరీ ఎక్కవ దూరం వెళ్లడం వల్ల తాత్కాలిక అటెన్షన్ వచ్చినా.. .దీర్ఘకాలంలో ఇబ్బందులు ఉంటాయని నేతలు ఆందోళన చెందుతున్నారట. అయితే ఈ విషయంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడులు ఒకే మాట మీద ఉన్నారు. ఇదే విషయాన్ని…అంతే గట్టిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు. దీంతో ఒక వ్యూహం దాని వెనక మరో వ్యూహం అన్నట్టు మత రాజకీయాన్ని రాజేస్తున్నారు టీడీపీ అధినేత. అంతిమంగా ఇది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news