పార్టీలో వారిని పక్కన పెట్టేసిన చంద్రబాబు

-

టీడీపీ అంటే… ముందుగా గుర్తుకు వచ్చేది ఓ నలుగురు సీనియర్లు. యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు వంటి నేతలు పార్టీ స్థాపించిన నాటి నుంచి కొనసాగుతున్నారు. అయితే వీరిలో యనమల, సోమిరెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల, అయ్యన్న పాత్రుడు వంటి నేతలు ఇప్పటికే కీలక పదవులు అనుభవించారు. యనమల, సోమిరెడ్డి అయితే వరుసగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడుతున్నప్పటికీ… మండలిలో అవకాశం కల్పిస్తూ… మంత్రివర్గంలో స్థానం కల్పించారు చంద్రబాబు.

1999, 2014 ప్రభుత్వాల్లో కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహించారు యనమల. ఇక 2014 ప్రభుత్వంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో యనమల, సోమిరెడ్డి, గోరంట్ల, అయ్యన్న పాత్రుడుకి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అలాగే భీమిని నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవి ఆశించారు. అయితే చంద్రబాబు మాత్రం కేబినెట్‌ కూర్పులో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి సీనియర్లను పక్కన పెట్టేసి… చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్‌ తాతయ్య మంత్రిపదవి ఆశించారు… అయితే చంద్రబాబు మాత్రం యువకుడు, ఆర్థికంగా స్థితిమంతుడు అయిన టీజీ భరత్‌కు అవకాశమిచ్చారు. విశాఖ జిల్లా నుంచి సీనియర్లను పక్కన పెట్టిన బాబు… ఎస్సీ మాదిగ, మహిళ కోటాలో వంగలపూడి అనితను మంత్రిని చేశారు. చిత్తూరు జిల్లా నుంచి కేవలం చంద్రబాబు మాత్రమే ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నారు. కర్నూలు, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించిన చంద్రబాబు… గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి మాత్రం ముగ్గురికి ఛాన్స్‌ ఇచ్చారు.

అయితే వీరిలో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచిన వారికి, యువకులకు ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. దీంతో సీనియర్లు కొంత అసహనంతో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డికి మంత్రిపదవి ఇవ్వడం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇవేవి పట్టించుకోని చంద్రబాబు… సీనియర్లను పక్కన పెట్టడం చూస్తుంటే… మంత్రివర్గ కూర్పులో లోకేశ్‌, పవన్‌ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news