అసంతృప్త నేతల పట్ల ఊ అంటారా… ఊహూ అంటారా…?

-

టికెట్ రాని సీనియర్ నేతలను చంద్రబాబు బుజ్జగిస్తారా… పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలను బాబు గాలికి వదిలేస్తారా… లేక పిలిపించి మాట్లాడుతారా… అసలు ముందుగా అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబు తప్పు చేశారా… సీటు దక్కని నేతల భవిష్యత్ ఏమిటీ…

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల గోల ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో సీనియర్లకు టికెట్లు దక్కలేదు. అలాగే సర్వేల పేరుతో పలు చోట్ల పాత వారిని పక్కన పెట్టి… కొత్త వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీంతో… అసంతృప్తుల గోల ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారిందనేది వాస్తవం. వాస్తవానికి పార్టీ ఓడిన తర్వాత చాలా మంది సీనియర్ నేతలు పార్టీని గాలికి వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లారనేది వాస్తవం. ప్రస్తుత జగన్ సర్కార్‌కు భయపడి కొందరు… కేసులకు భయపడి మరి కొందరు చాలా వరకు నియోజకవర్గాలకు దూరంగానే ఉన్నారు. అయితే కొంతమంది సీనియర్లు మాత్రం నిరంతరం కార్యకర్తలతో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ… పార్టీని యాక్టివ్ మోడ్‌లో ఉంచగలిగారు. అలాంటి వారిలో కళా వెంకట్రావు, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, వర్మ, సుగుణమ్మ, ఉక్కు ప్రవీణ్ లాంటి నేతలు ముందు వరుసలో నిలిచారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ సరిగ్గా 2022 జనవరి ఒకటిన చంద్రబాబు చేసిన ప్రకటన పార్టీలోని మిగిలిన నేతలను కూడా బయటకు వచ్చేలా చేసింది. ఆ తర్వాత ఒంగోలులో నిర్వహించిన మహానాడుతో భయాన్ని పక్కన పెట్టిన నేతలు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారనేది వాస్తవం. దీంతో ప్రతిపక్ష పాత్రను విజయవంతగా నిర్వహించారు టీడీపీ నేతలు. అయితే ఇదే సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే… పొత్తు పెట్టుకోవాల్సిందే అనే మాటను బలంగా నమ్మిన చంద్రబాబు… జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకున్నారు. రెండు పార్టీలకు 31 స్థానాలు కేటాయించారు చంద్రబాబు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది.

ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ… జనాల్లో తిరుగుతున్న కొందరు నేతలకు ప్రస్తుత ఎన్నికల్లో సీటు దక్కలేదు. దీంతో వారిలో కొందరు ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కొందరు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తుండగా… మరికొందరు మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఇలాంటి వారికి చంద్రబాబు ఎలాంటి హామీ ఇస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎచ్చెర్ల నియోజకవర్గం టికెట్ ఆశించిన కళా వెంకట్రావును కాదని… ఇప్పుడు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అది కూడా కాదంటే… చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో ఒక సీటును కళాకు కేటాయిస్తారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.

అటు మాజీ మంత్రి దేవినేని ఉమాను పక్కన పెట్టిన చంద్రబాబు… మైలవరం అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పేరు ప్రకటించారు. దీంతో దేవినేని సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు దేవినేని పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడానికి ఏకైక కారణం… ఎమ్మెల్సీ ఇచ్చి… మంత్రి పదవి ఇస్తారనే హామీ చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు ప్రొద్దుటూరు టికెట్ ఆశించిన ఉక్కు ప్రవీణ్‌కు బదులుగా సీనియర్ నేత వరదరాజుల రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చారు. దీంతో ప్రవీణ్ ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రవీణ్‌తో చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదు. దీంతో ప్రొద్దుటూరులో ఏం జరుగుతుందో తెలియటం లేదు. తెనాలి టికెట్ ఆశించిన ఆలపాటి రాజాను పక్కన పెట్టింది టీడీపీ. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో రాజా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు కూడా. గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారని కూడా అంతా భావించారు. కానీ అదీ జరగలేదు. దీంతో రాజాను చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

టికెట్లు ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మిదేవి, కలమట వెంకట రమణ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు పార్టీ తరఫున ఎవరూ ఎలాంటి చర్చలు జరపలేదు కూడా. అసలు సీటు ఎందుకు ఇవ్వలేదో కూడా ఇప్పటి వరకు తెలియజేయకపోవడంపై ఈ ఇద్దరు నేతలు గుర్రుగా ఉన్నారు. వీరిని చంద్రబాబు ఎలా బుజ్జగిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక మరో సీనియర్ నేత సుగుణమ్మకు టికెట్ లేకపోవడంపై స్వయంగా చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సమీకరణలో భాగంగా ఇవ్వలేకపోతున్నట్లు వెల్లడిచారు. అయితే ఎన్నికల తర్వాత సుగుణమ్మకు ఏదైనా పదవి ఇస్తారా లేదా అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే పిఠాపురం టికెట్ ఆశించిన వర్మకు మాత్రం… ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు బహిరంగంగానే హామీ ఇచ్చారు. దీంతో వర్మ కాస్త చల్లబడ్డాడు.

ఇంతమంది అసంతృప్తులు ఉండగా… కేవలం వర్మకు మాత్రమే చంద్రబాబు ఇప్పటి వరకు బహిరంగంగా హామీ ఇచ్చారు తప్ప… మిగిలిన నేతలతో చర్చించినట్లుగా కూడా లేదు. ఈ నేపథ్యంలో అసలు అసంతృప్తుల పట్ల చంద్రబాబు వైఖరి ఏమిటీ… చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు… అనే అంశం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news