చిరు వెళ్లాక మోహన్ బాబు వెళ్తారు అని ఛానెళ్లు తెగ మోత మోగిస్తున్నాయి. ఆ విధంగా ఎవ్వరు వెళ్లినా తాము వెల్కం చేస్తామని అంటున్నారు మంత్రి పేర్నినాని.చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తున్న మంత్రి సమస్య పరిష్కారం దిశగా ఇవాళ అయినా తన పరిధిలో ఏపాటి చొరవ చూపిస్తారో అన్నది ఓ పెద్ద సందేహాస్పద విషయం.
చిరు అభిమానులు, పవన్ అభిమానులు ఎవరి తొందర వారు ప్రకటిస్తున్నారు. ఆ విధంగా కాకుండా కాస్త సంయమనం పాటించి భేటీ తరువాత వెలువడే నిర్ణయాలపై పూర్తి అధ్యయనం చేశాక మాట్లాడితే అటు చిత్ర పరిశ్రమకు ఇటు మెగా కుటుంబానికి రెండు వర్గాలకూ మేలు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే అప్పుడే తొందర పడకండి.. అని ఇంకొందరు మెగా కుటుంబం శ్రేయోభిలాషులు విజ్ఞప్తి చేస్తున్నారు. చర్చలు జరిగాక ఓ సానుకూల ఫలితం అందాక మాత్రమే మాట్లాడితే కాస్తయినా మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది అని కూడా వారి వాదన.
చిరంజీవి,జగన్ భేటీకి సంబంధించి బయట చాలా చర్చ నడుస్తోంది.ఇందుకు సంబంధించి ట్రోల్స్ కూడా విపరీతంగానే ఉన్నాయి. తాను కేవలం ఇండస్ట్రీ బిడ్డగానే ఇక్కడకు వచ్చానని, తన రాక వెనుక ఎటువంటి ఉద్దేశాలు లేవని తాను ఇండస్ట్రీ పెద్దను కానే కానని ఓ అర్థం వచ్చేలా స్పష్టాతి స్పష్టమయిన రీతిలో వివరించారు చిరు. జగన్ తో భేటీ అనంతరం సంబంధిత వివరాలు వెల్లడి చేయనున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇండస్ట్రీ పెద్ద అనే హోదాలో ఇంతకాలం మోహన్ బాబు ఉండాలని చాలా మంది అన్నారు. బయట కూడా అదే మాట వినిపించారు. కానీ ఎందుకనో తనకు మాత్రం పెద్ద అన్న పదం నచ్చదని, కష్టకాలంలో ఏ సాయం కావాలన్నా తానుంటానని పదే పదే చిరు చెప్పారు. ఈ తరుణంలో మోహన్ బాబు కూడా జగన్ ను కలవడం కానీ లేఖ రాయడం కానీ చేయొచ్చు. ప్రస్తుతం ఆయన తన సొంత యూనివర్శిటీ పనుల్లో ఉన్నారు. మోహన్ బాబు యూనివర్శిటీ అన్నది తమ చిరకాల వాంఛ అని చెబుతున్నారు. ఈ పనులు పూర్తయ్యాక త్వరలో జగన్ ను మోహన్ బాబు కలిసే అవకాశాలను కొట్టి పారేయలేం.
మరోవైపు జనసేన మాత్రం చర్చలను తీవ్రంగా పరిగణిస్తోంది. చిరు అక్కడికి వెళ్తే చులకన అయిపోతారని బాధపడుతోంది. అలా కాకుండా ఉండి ఉంటే హుందాతనం మరింత నిలుపుకునే వారయ్యేవారని అంటున్నారు పవన్ అభిమానులు.ఏవి ఎలా ఉన్నా సురేశ్ బాబు,దిల్ రాజు లాంటి వారు గత ఏడాది ఏప్రిల్ నుంచి నడిపిస్తున్న చర్చల పర్వం ఏదీ కొలిక్కిరాలేదు.ఇప్పుడైనా ఈ సమస్యకు సంక్రాంతి వేళ సమాధానం వస్తే పరిష్కారం చిక్కితే అంతకుమించిన ఆనందం ఏముంటుందని?