ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా. దేశంలో వీరిని మించిన స్నేహితులు ఉండరు ఏమో…? గుజారత్ నుంచి ఢిల్లీ వరకు వీరి ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. కార్యకర్తల స్థాయి నుంచి నేడు దేశాన్ని శాశించే స్థాయికి వెళ్ళారు ఇద్దరు నేతలు. ఇతర కేబినేట్ మంత్రులు ఉన్నా సరే వారి హవానే కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఏ నిర్ణయం అయినా సరే వాళ్ళు తీసుకోకుండా అమలు కాదు.
అలాంటిది ఒక విషయంలో వారి మధ్య విభేదాలు వచ్చాయనే వ్యాఖ్యలు ఇప్పుడు వినపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ తాజాగా చేసిన కొన్ని సంచలన ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఈ భేదాభిప్రాయాలతో దేశం తగిన మూల్యం చెల్లించుకుంటోందన్నారు ఆయన. పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ జనాభా పట్టిక, ఎన్నార్సీలు కాలక్రమంలో భాగమని షా అన్నారు. మోదీ మాట్లాడుతూ ఎన్నార్సీని అమలుచేయబోం అన్నారు. అంటే ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? ఇది చూస్తుంటే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు స్పష్టమవుతోందని,
ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మతాల పేరిట దేశ ప్రజలను విభజించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. మొదటి ఐదేళ్లలో మోదీ జీఎస్టీని అమలు చేస్తే, ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ లాంటి వాటిని అమిత్‌షా తీసుకొచ్చారని, దేశంలోని పేదలు ఎన్నార్సీకి అవసరమైన ఆధారాలను ఎలా ఇస్తారని, కేంద్రం ఆలోచించాలని భూపేశ్ భాగేల్ సూచించారు.