మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది.జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో అధికారం పీఠం ఎవరిది అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గెలిచేది మేమే అంటూ కూటమి నేతలు నానా హడావుడి చేసేస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం ఏపీ ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నారు. ఇటీవల ఐ-ప్యాక్ టీంని కలిసిన సందర్భంగా 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన… ఈ మూడు పార్టీలు కలిసి జట్టుగా వచ్చినా అదరకుండా బెదరకుండా ఎన్నికలకు వెళ్లారు సీఎం జగన్. ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని చాలా సందర్భాల్లో చెప్పిన సీఎం ఇప్పుడు గెలుపుపై కూడా అదే ధీమాతో ఉన్నారు. అయితే జగన్ ఎందుకంత ధీమాగా ఉన్నారు అనేది ఇతరులకు అంతుపట్టడం లేదు.
2019లో సాధించిన151 అసెంబ్లీ,22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. తమకు వచ్చే సీట్లను ప్రశాంత్ కిశోర సైతం ఊహించలేరని చెప్పుకొచ్చారు.దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ కనిపించలేదు.వైసీపీ ముఖ్య నేతలు మాత్రం జగన్ ఈ ప్రకటన ఆషామాషీగా చేయలేదని చెబుతున్నారు. పోలింగ్ కు ముందే ఎగ్జిట్ పోల్, ఓటింగ్ సరళి, ఓటర్ల పల్స్ తెలుసుకొనేందుకు సీఎం జగన్ పూర్తిగా కసరత్తు చేశారు. వైసీపీకి రాజకీయంగా సహకారం అందిస్తున్న ఐప్యాక్, సొంత మీడియా సంస్థ, నిఘా వ్యవస్థతో పాటుగా మరో మూడు సర్వే సంస్థలను రంగంలోకి దించి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు.
ప్రతీ పోలింగ్ బూత్ నుంచి నియోజకవర్గాల వారీగా వచ్చిన పోలింగ్ సరళిని, నివేదికలను పరిగణనలోకి తీసుకొని ఓటింగ్ శాతంపై లెక్కలు వేసారు. దీని ద్వారా మహిళల్లో పెద్ద ఎత్తున మద్దతు దక్కిందనే నిర్ధారణకు వచ్చారు.అందువలన కూటమి నుంచి గెలిచే స్థానాలపైన ఒక అంచనాకు వచ్చారు. ఆ తరువాతనే జగన్ ప్రకటన చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 151కి పైగా సీట్లు గెలుస్తామని ,ప్రశాంత్ కిశోర్ ఉహించనంతగా మెజారిటీ సీట్లు వస్తాయని అన్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. హైప్ కోసం జగన్ ఇలాంటి ప్రకటనలు చేయరనేది మరో వాదన ఉంది.తుది ఫలితాలు వస్తేగాని జగన్ ఎందుకంత ధీమాతో ఉన్నారనేది అర్థం అవుతుంది.