ఆర్‌టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 5వ తేదీ వరకు కార్మికులు బేషరతుగా విధుల్లో చేరవచ్చని తెలిపారు.
ఆర్‌టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 5వ తేదీ వరకు కార్మికులు బేషరతుగా విధుల్లో చేరవచ్చని తెలిపారు. నవంబర్ 5వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు కార్మికులకు గడువు ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. గడువు లోపు కార్మికులు ఎలాంటి ఇబ్బంది, షరతులు లేకుండా స్వచ్ఛందంగా విధుల్లో తిరిగి చేరవచ్చని అన్నారు. గడువు తేదీ, సమయం ముగిశాక కార్మికులను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 4 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌టీసీ కార్మికులకు ఏకంగా 67 శాతం జీతాలను పెంచామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి బాగు కోరుకుంటామే గానీ, వారు నాశనం కావాలని తాము కోరుకోవడం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, యూనియన్ల మాయలో పడి కార్మికులు అనవసరంగా నష్టపోతున్నారన్నారు.
రాష్ట్రంలో 5100 రూట్లలో ప్రైవేటు బస్సులను నడిపించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నవంబర్ 5వ తేదీ లోపు కూడా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామని అన్నారు. కార్మికులు గడువు తేదీ లోపు విధుల్లో చేరాల్సిందిగా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా వెల్లడించారు.
ఆర్‌టీసీని ఎట్టిపరిస్థితిలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటిది ఆ పార్టీలకు చెందిన నాయకులు ఎలా పడితే అలా మాట్లాడడం సరికాదన్నారు. సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్‌టీసీని రద్దు చేసి, ప్రైవేటు వారికి అవకాశం ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. మోదీ పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి అనుగుణంగా ఆమోదించిన బీజేపీ ఎంపీలు ఇప్పుడు రాష్ట్రంలో ఆర్‌టీసీని విలీనం చేయమని అడగడం సరికాదన్నారు. ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.