కేసీఆర్‌ను మరోమారు ఆవిష్కరించిన ప్రెస్‌మీట్‌

-

ఒక సాధారణ వ్యక్తి మేధస్సు ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. కానీ, ఒక అసాధారణ వ్యక్తి మేధస్సు పరిధి ఎంత? అటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఆ మేధస్సు ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుందో, ఎన్ని మూలలకు విస్తరిస్తుందో, ఎన్ని సమస్యలను పరిష్కరిస్తుందో  నిన్నటి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఆవిష్కరించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు కేసీఆర్‌కు పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేవు. కానీ అప్పుడే ఆయనను దగ్గరగా చూసిన ఆచార్య జయశంకర్‌ లాంటి వారికి ఈయన సామాన్య నాయకుడుగా ఉండబోడనేది అర్థం అయింది. సాధారణంగా ఒక సమస్యను అర్థం చేసుకోవడంలో చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ, ఆ సమస్యకు మూలాలెక్కడున్నాయో, అవి ఎంత మేర విస్తరించి ఉన్నాయో తెలుసుకోవడం ఆషామాషీ కాదు. ఎందుకంటే ఒక్కొక్క మూలానికి ఒక్కోరకమైన పరిష్కారం ఉంటుంది. ప్రతిదానికి సమయం వచ్చేదాకా ఓపికగా ఎదురుచూడ్డం, రాగానే అస్త్రం ప్రయోగించడం యోధుడి లక్షణం. ఆ గుణాలతోనే ఎంతోమందికి సాధ్యంకాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్‌.

రెండు చేతులతో బాణాలు వేయగలవారిని సవ్యసాచి అంటారు. కేసీఆర్‌ ఒకే చేత్తో ఒకేసారి పలు బాణాలు సంధించగలరు. అవన్నీ తమదైన లక్ష్యాన్ని కచ్చితంగా చేధించేంత నేర్పరితనం ఆయన సొంతం.ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమైన నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలను  సంపూర్ణంగా ఔపోసన పట్టినవాడే కేసీఆర్‌. సమస్య వచ్చిన ప్రతీసారీ ఓ కొత్త పరిష్కారం చూపుతూ, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనేఉన్నాడాయన.

రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం ఒక్క కరోనాను ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతుంటే, అద్భుతమైన వ్యూహాలతో దాన్ని కట్టడి చేస్తూనే, ఇతరత్రా ముఖ్య సమస్యలవైపు దృష్టి సారించి, వాటి మూలాలకు కూడా పరిష్కారం చూపుతున్న మేధస్సు కేసీఆర్‌ది. దాన్ని నిన్న పరిపూర్ణంగా ఆస్వాదించారు రాష్ట్ర ప్రజలు.

కరోనా వ్యాప్తిని కేసీఆర్‌ డీల్‌ చేస్తున్న విధానం మిగతావారిలా మామూలుగా లేదు. ఆయనే అన్నట్లు ఇదొక యుద్ధం. కేసీఆర్‌ సర్వసైన్యాధ్యక్షుడు. ఒకేసారి పలు వ్యూహాలను అమలుచేస్తూ, అధికారులను పరుగులు పెట్టిస్తూ, కరోనాకే తికమక పుట్టించారు. అది ఏ దారిన వెళ్లబోతోందో ముందుగానే పసిగట్టి, గోడ కట్టారు. ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఉండబోదనే ఆశాభావం వ్యక్తం చేసి, ప్రపంచానికే ‘కాన్ఫిడెన్స్‌’ పెంచిన నాయకుడు ఆయన.

సమాచారం ఆయన అస్త్రం. డాటా లేకుండా ఆయన మాట్లాడరు. ఎవరినీ మాట్లాడనివ్వరు. ప్రతీదానికి ఖచ్చితమైన సమాచారం, నిఖార్సయిన అంకెలు ఉండితీరాలి. ఏ శాఖకు సంబంధించినదైనా, ఏ విషయమైనా పూర్తి అవగాహన తెచ్చుకోవడం ఆయన నైజం. ఆ తర్వాత ఆయన విశ్లేషణ ఆ యా శాఖల అధికారులకే విస్మయం కలిగించేంతగా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎన్నడూలేనంత పంట దిగుబడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. జలకళలతో అన్ని జలాశయాలు నిండుగా నవ్వుతున్నాయి. పంట చేతికొచ్చే ఈ సమయంలో కరోనా దాడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కోతలకు కూలీలు రాలేని పరిస్థితుల్లో హార్వెస్టర్ల గురించి, వాటి టెక్నీషియన్ల గురించి, ఆఖరికి వాటి స్పేర్‌పార్ట్ల గురించి కూడా ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉంటారా? సరే.. అయిపోయింది. పంట వచ్చింది. మిల్లులకు పోయింది. అక్కన్నుంచి గోదాంలకు పోయింది. ప్రతీచోటా లోడింగ్‌-అన్‌లోడింగ్‌ జరగాలి. అది చేయాలంటే బీహార్‌ కూలీలే కావాలి. దానికోసం కూడా బీహార్‌ అధికారులతో మాట్లాడి, ప్రత్యేక రైళ్లలో వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీలు ఎంతమంది ఉన్నారన్న సమాచారం రాత్రికి రాత్రి తెప్పించి వారందరినీ తన ప్రజలుగానే గుర్తించి, అన్నం పెట్టగలిగే నాయకుడున్న ఈ రాష్ట్రం నిజంగా ధన్యజీవి.

కరోనా మహమ్మారి, కేసీఆర్‌ను మరింత ధృడంగా తయారుచేసింది. ఆ వీరుడి ఆపత్కాల నిర్వహణ (CRISIS MANAGEMENT )అంటే ఏంటో ప్రపంచానికి చూపింది. ప్రపంచదేశాల నాయకులు కన్నీరు పెడుతున్న తరుణాన, మంత్రులే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో, ఎంతో నిబ్బరంగా, మొండి ధైర్యంతో పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్విజయం సాధించడానికి ఎంతో కాలం పట్టదు. అది ఈ ప్రపంచమంతా చూడాలి. నాయకుడంటే ఇలా ఉండాలని నేర్చుకోవాలి. అటువంటి నాయకుడు పాలిస్తున్న రాష్ట్రంలో పౌరులుగా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు గర్వపడాలి.

నిన్న ఒక్క అర్ధగంట వ్యవధిలో తనలోని బహుముఖ వ్యక్తిత్వ విశ్వరూపాన్ని చూపారు కేసీఆర్‌. అది చూసి తన్మయులమైన మనమంతా ఈ నవభారతంలో అర్జునులమే.

 

  • చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news