మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాకముందే…తాజాగా కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ఆడియో లీక్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ తనదేనంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే కౌశిక్ రెడ్డి ఆడియోపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. కౌశిక్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. 24 గంటల్లో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పార్టీ ఆదేశించింది. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిందారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని, అవసరమైతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు.
ఇటీవలే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా… కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా కౌశిక్ రెడ్డి ఆడియో ఆ ఊహాగానాలకు మరింత బలం పోసినట్లు అయింది. అయితే ఆ ఆడియోపై కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.