కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్ధులు టార్గెట్ చేయకపోయినా…కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తూ…పార్టీని బాగా డ్యామేజ్ చేస్తారు. ముందు నుంచి కాంగ్రెస్‌లో ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ రచ్చ కంటిన్యూ అవుతూనే వస్తుంది. నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే భాగంలో పార్టీకి చాలా డ్యామేజ్ చేశారు. అటు కేసీఆర్ దెబ్బకు మరింత దబ్బతింది.
ఈ డ్యామేజ్‌ని కొత్తగా అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి తగ్గించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయారు. నాయకులు ఎక్కడకక్కడ రచ్చ చేస్తూనే వస్తున్నారు. కొందరు సీనియర్లు రేవంత్‌ని వెనుక నుండి దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తూనే వస్తున్నారు. అధిష్టానం సర్ది చెప్పినా సరే కాంగ్రెస్‌లో విభేదాలు సద్దుమనగలేదు.
కానీ ఏమైందో తెలియదు గానీ..హస్తం నేతలు అంతా ఒకటయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంలో వరిదీక్ష చేసిన రేవంత్ రెడ్డికి నాయకులు మద్ధతు పలికారు. ముఖ్యంగా రేవంత్‌ని ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మద్ధతు తెలిపారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోదండ రెడ్డి, హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు రేవంత్‌కు సపోర్ట్‌గా నిలిచారు. అంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు.
అలాగే పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని తామందరం పీసీసీ ప్రెసిడెంట్లమేనన్న కోమటిరెడ్డి.. తమకు పదవులు ముఖ్యం కాదని, తన రక్తంలోనే కాంగ్రెస్ ఉందని మాట్లాడారు. అంటే ఇక నుంచి అందరూ నాయకులు కలిసి పనిచేయనున్నారని అర్ధమవుతుంది. అయితే ఎన్నికల వరకు కాంగ్రెస్ నేతలు ఇలాగే కలిసి రాజకీయం చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా పైన పటారాం, లోన లోటారం అన్నట్లు రాజకీయం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ మునుగుతుంది. అయితే ఈ యూనిటీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత రేవంత్‌దే.