ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇది తమకు అనుకూలంగా ఉందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. మరి వాస్తవ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. దీనికి సంబంధించి పొరుగున ఉన్న తెలంగాణాలో కూడా భారీగా నిరసనలు జరిగాయి. ఇది అక్కడ కూడా జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు.
తెలంగాణా సంగతి పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దగా ప్రభావం చూపేలా కనపడటం లేదనే మాట వినపడుతోంది. ముందు ప్రజల్లో చర్చ జరిగినా దీన్ని చర్చల్లో ఉంచే విధంగా టీడీపీ వ్యవహరించలేకపోయింది. నిరసన కార్యక్రమాలను కూడా పెద్దగా నిర్వహించలేదు. స్వచ్చందంగా కార్యకర్తలు బయటకు వచ్చినా దాన్ని నాయకులు వాడుకోలేదు. దీనితో లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రభావం కనపడటం లేదు. అసలు ఆ పాదయాత్ర జరుగుతుందా లేదా అనే దానిపై కూడా పెద్దగా సమాచారం రావడం లేదు.
అక్టోబర్ లో మొదలుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా సరే అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు నిర్వహించిన బస్ యాత్రలో లోకేష్ పాల్గొంటారు అని కొందరు అంటున్నారు. ఇక భువనేశ్వరి కూడా యాత్ర చేసే అవకాశం ఉందనే మాట కూడా వినపడుతోంది. దీనితో ఇది ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. చంద్రబాబు తాజాగా రాసిన లేఖను ప్రజల్లోకి కూడా టీడీపీ నేతలు తీసుకువెళ్ళలేదు. అటు అధికార పార్టీ ఇప్పటికే ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేసుకుంది.