ఢిల్లీ అల్లర్లతో పెరుగుతున్న మృతుల సంఖ్య‌.. రంగంలోకి దిగిన కేంద్రం..!!

దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఈశాన్య ఢిల్లీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల‌తో అనే మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం భయంభయంగా గడుపుతున్నారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రంగంలోకి దిగిన కేంద్రం.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు అప్పగించింది.

బుధవారం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఈ ఉద్రిక్త‌త‌ను నియంత్రించడం పోలీసుల వల్ల కాకపోవడంతో సైన్యాన్ని దించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నిన్న పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన హింసలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ రతన్‌లాల్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 106 మందిని అరెస్ట్ చేశారు. 18 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.