అవినాష్ దూకుడు.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేస్తున్నాడా..?

విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు, దేవినేని రాజ‌శేఖ‌ర్ (నెహ్రూ) వార‌సుడు దేవినేని అవినాష్‌.. చాన్నాళ్ల త‌ర్వాత దూకుడు చూపిస్తున్నార‌ట‌. ఇప్పుడు ఇదే విష‌యంపై అదికార పార్టీ వైసీపీలో చ‌ర్చోప‌చ‌ర్చ లు సాగుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. అవినాష్ .. ఎప్పుడూ జోరు చూపించ‌లేక పోయారు. టీడీపీలో ఉండ‌గా .. ఆయ‌న‌కు తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చినా.. కూడా పైనుంచి కంట్రోల్ చేయ‌డంతో ఆయ‌న స్వ‌యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కానీ, త‌న మెద‌డుకు ప‌దును పెట్టి పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డం కానీ చేయ‌లేక పోయారు.

టీడీపీలో ఉండ‌గా త‌న‌ను తాను ఓ టీవీ మాదిరిగా చెప్పుకొనే వారు అవినాష్‌. రిమోట్ కంట్రోల్ ఎలా చెబితే అలా చేయ‌డ‌మే త‌ప్ప‌త‌న‌కు స్వ‌తంత్రం లేద‌ని కూడా త‌న అనుచ‌రుల‌తో అనేవారు. అందుకే పార్టీ మారిపోయే టైంలో త‌న బాబాయ్ అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆగ‌మ‌ని చెప్పినా కూడా అవినాష్ మాత్రం ఆయ‌న మాట పెడ‌చెవిన పెట్టి పార్టీ మారిపోయారు. ఇక‌, వైసీపీలోకి వ‌చ్చాక‌.. పార్టీలోను, త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల విష‌యంలోనూ కూడా అవినాష్ దూకుడుగా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డంలో త‌న‌కు ఉన్న వ్యూహాన్ని అనుస‌రిస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీలోనూ అవినాష్‌కు స్వ‌తంత్రంగా ప‌నిచేసే స్వేచ్ఛ ల‌భించింద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా అవినాష్ సేవ‌లు అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. త‌న కుటుంబం దేవినేని వ‌ర్గానికి ఉన్న ప‌లుకుబ‌డిని వినియోగించి.. ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్ట్ నేప థ్యంలో ప్ర‌జ‌లకు అన్ని విధాలా సాయం చేసేందుకు దాత‌ల‌ను స‌మీక‌రిస్తున్నారు. త‌న‌కు ప‌రిచయం ఉన్న పారిశ్రామిక వేత్త‌ల‌ను విద్యా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను కూడా కూడ‌గ‌ట్టి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేలా ప్రోత్స‌హిస్తున్నారు. వారిని నేరుగా సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకువెళ్లి ఆయా విరాళాల‌ను నేరుగా జ‌గ‌న్‌కు అందేలా చేస్తున్నారు. దీంతో అవినాష్ దూకుడును జ‌గ‌న్ స్వ‌యంగా మెచ్చుకుని కీప్ ఇట్ అప్‌! అని ప్ర‌శంసించిన‌ట్టు దేవినేని వ‌ర్గం చెబుతోంది.