‘‘ కొడుకు అయినంత మాత్రాన నా కొడుకు నా వారసుడు కాదు. ఎవరు వారసుడైతే వాడే నా కొడుకు’’ అంటూ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే ట్వీట్ చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వం పార్టీకి తప్పని సరిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తూ ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన మాటలను ఉటంకించారు. పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకే సొంతమని చెప్పడం సమంజసం కాదని చెప్పకనే చెప్పారు.
గడిచిన 56 ఏళ్లలో తొలిసారిగా శివసేన రెండు దసరా ర్యాలీలను నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం బాంద్రా కుర్లాలోని ఎంఎంఆర్డీయే మైదానం నుంచి ర్యాలీని ప్రారంభిస్తుండగా.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివాజీ మైదానం నుంచి ప్రారంభించనున్నారు. అయితే, ర్యాలీ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఠాక్రేకు ట్విటర్ వేదికగా శిందే కౌంటర్ ఇచ్చారు.
తండ్రి బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను తన అధీనంలో ఉంచుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నిస్తుండగా.. మాదే అసలైన శివసేన అంటూ శిందే వర్గం చెబుతోంది. ర్యాలీల నిర్వహణలోనూ రెండు వర్గాలు కోర్టు మెట్లెకారు. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పురావడంతో శివాజీ పార్కు నుంచి ఆయన ర్యాలీ నిర్వహిస్తున్నారు.