ఆరిపోయే దీపం..టీఆర్ఎస్ ప్రభుత్వం : ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయబోరని.. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉందని… కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలని తెలిపారు.

అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేసాననని చెప్పిన ఈటల.. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమ కాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసానని తెలిపారు. ప్రజల్లో బలమున్న వారు చేసే పనులు ఇవి కావని… బలహీనులు కాబట్టే వాళ్లు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.

మోడీ సర్కారు సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని.. అందుకే 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానమిచ్చారన్నారు. ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికే మాత్రమే అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. 0.5 శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని… ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడబోమని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు తప్ప, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరని హెచ్చరించారు.