తెలంగాణ బీజేపీలో ఇంకా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తున్నాయి. పైకి అంతా సెట్ అయినట్లు నాయకులు చెబుతున్నారు..కానీ అంతర్గతంగా గ్యాప్ మాత్రం అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీలో మునుపటి దూకుడు లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి పోయాక బండి సంజయ్ తన పని తాను చేసుకుంటున్నారు. ఇటు కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనుకున్న మేర దూకుడుగా పనిచేయడం లేదు. కేసిఆర్ ప్రభుత్వంపై అగ్రెసివ్‌గా వెళ్ళడం లేదు.
అటు ధర్మపురి అరవింద్..కవితని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. ఇక ఆయన పని ఆయనది అన్నట్లు ఉంది. కీలక నేతలైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మొదట నుంచి ఈ ఇద్దరు సెపరేట్ గానే ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. అలాగే బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి కూడా వీరే కారణమనే టాక్ ఉంది. బండిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అధ్యక్షుడుని మార్చినట్లు ప్రచారం జరిగింది.
ఇక కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక..ఈ ఇద్దరు సెపరేట్ గానే ముందుకెళుతున్నారు. తాజాగా ఈ ఇద్దరు నేతలు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వీరి వర్గాన్ని వీరు పెంచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజేపిలో కనిపించడం లేదు. ఈయన బిజేపిలో ఉంటారో లేదో కూడా తెలియడం లేదు. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు ఏం అయ్యారో కూడా కనబడటం లేదు.
ఇలా బిజేపిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ముందుకెళుతున్నారు. దీని వల్ల బిజేపి బలం ఇంచు కూడా పెరగదు. కలిసికట్టుగా పనిచేయడం లేదు. ఇదే పరిస్తితి కొనసాగితే ఎన్నికల్లో బిజేపి సత్తా చాటలేదు. పైగా ఎన్నికల సమయంలో కొందరు బిజేపి నేతలు కాంగ్రెస్ లోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ బిజేపి నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.