తొలిసారి ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇంతకాలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈటల ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా అడుగుపెట్టనున్నారు. ఎప్పుడైతే కేసీఆర్… టీఆర్ఎస్ పార్టీ పెట్టారో…అప్పుడే రాజేందర్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ ఇచ్చి…వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. 2004లో తొలిసారిగా కమలాపూర్ నుంచి రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఉపఎన్నికలో కూడా కమలాపూర్ నుంచి ఈటల విజయం సాధించారు.
ఇక తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009 ఎన్నికల్లో రాజేందర్…హుజూరాబాద్ బరిలో దిగి విజయం సాధించారు. మళ్ళీ 2010లో ఉపఎన్నిక రావడంతో మరొకసారి హుజూరాబాద్‌లో దిగి గెలిచారు. తెలంగాణ వచ్చాక అంటే 2014లో హుజూరాబాద్ నుంచి మూడోసారి బరిలో దిగి విజయం సాధించారు. అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల్లో సైతం నాల్గవ సారి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఆరు నెల క్రితం వరకు కేసీఆర్ క్యాబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆరు నెలల క్రితం ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో కేసీఆర్, ఆయన్ని క్యాబినెట్ నుంచి తప్పించారు. ఇక ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం ఈటల టీఆర్ఎస్‌ని వదిలి…ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తొలిసారి బీజేపీ తరుపున హుజూరాబాద్ బరిలో దిగి…టీఆర్ఎస్‌ని చిత్తుగా ఓడించి ఏడోసారి ఈటల ఎమ్మెల్యే అయ్యారు.
ఇప్పుడు తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణాస్వీకారం చేయించారు. అయితే తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇంతకాలం టీఆర్ఎస్ తరుపున అసెంబ్లీలోకి వెళ్ళిన ఈటల ఇప్పుడు బీజేపీ నుచి వెళ్లనున్నారు. ఇక ఈటల ఎంట్రీతో అసెంబ్లీలో కేసీఆర్ పరిస్తితి ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలో తలపడితే ఎలా ఉంటుందో చూడాలనేది తెలంగాణ మొత్తం ఎదురుచూస్తుంది.