వారం రోజుల్లో బీజేపీలోకి ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉంద‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఎలాంటి హామీలు లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఇక ఎమ్మెల్యే ప‌దవికి, పార్టీకి రాజీనామా చేయ‌డానికి ఈటల న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హా తీసుకుంటున్నార‌ని వివరించారు. తెలంగాణ ఉద్య‌మ‌కారులు బీజేపీని మంచి వేదిక‌గా భావిస్తున్నారని ఈ సందర్భంగా బండి సంజ‌య్ పేర్కొన్నారు.

ఇక సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కేసుల గురించి గత వారం రోజులుగా ఆరా తీస్తున్నామని, సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి వివరాలను తీసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు . అలానే 18 మంది టీఆర్ఎస్ ముఖ్య నేతల అవినీతి వివరాలను సేకరించామని… వాటి గురించి కూడా న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు తీసుకున్నట్లు వివరించారు. అమ‌ర వీరుల ఆశ‌య సాధ‌న‌కు విరుద్ధంగా తెలంగాణ‌లో కేసీఆర్‌ పాల‌న సాగుతోంద‌ని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అమర వీరుల ఆశయాల సాధన సాధ్యమవుతుందని అన్నారు . తెలంగాణ ఏర్ప‌డ్డ నాటి నుంచి క‌ల్వ‌కుంట్ల‌, ఒవైసీ కుటుంబాలే ల‌బ్ధి పొందాయ‌ని ఆరోపించారు.