గీతారెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకురాలు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లలో పనిచేసిన నాయకురాలు. అలా ఉమ్మడి ఏపీలో వెలుగు వెలిగిన గీతారెడ్డి ఇప్పుడు రాజకీయంగా తెరమరుగయ్యే స్థితికి వచ్చారు.
ఇటీవల ఆమె పెద్దగా రాజకీయాల్లో కనిపించడం లేదు. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు..దీంతో ఆమె రాజకీయం ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అలా అని వేరే పార్టీలోకి మారలేదు. ఒక డాక్టర్ గా కెరీర్ ప్రారంభించి విదేశాల్లో పనిచేస్తున్న గీతారెడ్డి..రాజీవ్ గాంధీ చొరవతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 1989లో తొలిసారి గజ్వేల్ బరిలో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత వరుస ఓటములు పలకరించిన వెనక్కి తగ్గలేదు. మళ్ళీ 2004లో ఆమె విజయం సాధించారు.
ఇక 2009లో గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు..అప్పుడు కూడా ఆమె విజయం అందుకున్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా సత్తా చాటారు. అయితే చాలామంది కాంగ్రెస్ నేతలు బిఆర్‌ఎస్ లోకి వెళ్ళిన ఆమె మాత్రం నిబద్దత గల కాంగ్రెస్ కార్యకర్తగా ఉండిపోయారు. అయితే 2018లో ఆమె ఓటమి పాలయ్యారు.
2018లో జహీరాబాద్ నుంచి బిఆర్‌ఎస్ తరుపున మాణిక్ రావు పోటీ చేసి గెలిచారు.అయితే అక్కడే మళ్ళీ పోటీచేయడానికి గీతారెడ్డి రెడీ అవుతున్నారు. ఇక ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు ఆమె పోరాడుతున్నారు. కానీ జహీరాబాద్ లో బిఆర్‌ఎస్ బలంగానే ఉంది. అదే సమయంలో అక్కడ బిజేపికి 20 వేల ఓటు బ్యాంకు ఉంది. దీని వల్ల ఓట్లు చీలుతాయి. మరి ఇవన్నీ దాటుకుని గీతారెడ్డి జహీరాబాద్ లో గెలుస్తారో లేదో చూడాలి.