‘ మా పార్టీలోకి ఎవరైనా రావాలంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఆ తర్వాతే వారిని చేర్చుకుంటాం. పార్టీ మారిన వారి సభ్యత్వాన్ని స్పీకర్ వెంటనే రద్దు చేయాలి ‘ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు ఇవి. అయితే.. తాము తలుపులు తెరిస్తే.. టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని కూడా వైసీపీ నేతలు పలు మార్లు అన్నారు. అయితే.. తాజా విషయం ఏమిటంటే.. టీడీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికార వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ.. అదే జరిగితే.. ముందుగా గొట్టిపాటి రాజీనామా చేయాలి.. ఆతర్వాత వచ్చే ఉప ఎన్నికలో వైసీపీ తరుపున పోటీ చేసి గెలవాలి. అయితే.. ఈ రిస్క్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీగా ఉన్నారా..? అన్నదే పెద్ద ప్రశ్న. ఒకవేళ.. జగన్ ఓకే అంటే మాత్రం గొట్టిపాటి రాజీనామా చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే.. గొట్టిపాటి వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లారు. ఇక 2019 ఎన్నికల్లోనూ గొట్టిపాటి గెలిచారు. అయితే.. తాజాగా.. ఆయన అధికార వైసీపీలోకి వస్తారనే టాక్ వినిపిస్తోంది.
గతంలో వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో గొట్టిపాటి వైసీపీలోకి వెళ్తారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే.. ఇక్కడ సమస్య ఏమిటంటే.. ముఖ్యమంత్రి జగన్ పెట్టిన కండిషనే. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుంది. ఈ సమయంలోనే ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా వైసీపీకి లేదు. అంతేగాకుండా.. ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికకు వెళ్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అంత రిస్క్ తీసుకుంటారా..? అనే అనుమనాలు పార్టీవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇక్కడ గొట్టిపాటికి మాత్రం ప్రజల్లో వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఉప ఎన్నిక వచ్చినా సులభంగా గెలుస్తారనే టాక్ ఉంది. కానీ.. ఏమాత్రం తేడా వచ్చినా.. అది ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమే. అందుకే ఈ సమయంలో అనవసరమైన రిస్క్ తీసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరనే టాక్ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏది ఏమైనా.. జగన్ ఓకే అంటేనే గొట్టిపాటి రవికుమార్ రాజీనామా, వైసీపీలోకి రావడం.. ఉప ఎన్నికకు వెళ్లడం జరుగుతుంది. లేదంటే.. గొట్టిపాటి టీడీపీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే.. ఈ ప్రచారాన్ని గొట్టిపాటి రవికుమార్ కూడా ఇప్పటి వరకు ఖండించకపోవడం గమనార్హం. చూడాలి మరి ఏం జరుగుతుందో..!