ఏపీలో రంగుల రాజకీయం…

-

ఏపీ రాజకీయాలు రంగులు చుట్టూ తిరుగుతున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో రంగుల రాజకీయం హీటెక్కింది. తొలిసారి అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్ పాలనలో తనదైన ముద్ర వేయాలని బాగా ఉత్సాహపడుతున్నారు. అందుకే గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటిని రద్దు చేసుకుంటూ వెళుతూ…కొత్త నిర్ణయాలని తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకురాని విధంగా గ్రామ వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థలని జగన్ తీసుకొచ్చారు.


వాలంటీర్ల పేరిట ఇప్పటికే ఉద్యోగులని నియమించిన జగన్…సచివాలయాల పేరిట ఉద్యోగుల భర్తీ ప్రక్రియని మొదలుపెట్టారు. ఈ ఉద్యోగులు అంతా గ్రామాల్లో సచివాలయాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తారు. దీంతో ఏపీ ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటుని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఉండే పంచాయితీ బిల్డింగులకు వైసీపీ పార్టీకి సంబంధించిన మూడు రంగులు వేసి సచివాలయాలు చేస్తున్నారు.

ఇప్పటికే కలెక్టర్ల నుంచి వచ్చిన ఉత్తర్వులతో పంచాయితీ భవనాల రంగులు మారబోతున్నాయని తెలుస్తోంది. వైసీపీ పార్టీకి చెందిన మూడురంగులతో పాటు ప్రతి పంచాయితీలోనూ జగన్ ఫోటో ఒకటి తప్పకుండా ఏర్పాటుచేయాలని పంచాయితీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ప్రతి పంచాయితీ వైసీపీ రంగులోకి మారిపోనుంది. అయితే గ్రామాల్లో పంచాయితికి రంగులు మార్చే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వం పంచాయితీ కార్యాలయాలకు రంగులు మార్చడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పైగా పంచాయితీల్లో ఉద్యోగులు, వాలంటీర్ల పేరుతో వైసీపీ తన కార్యకర్తలు, మద్దతుదారులకు ఉద్యోగాలు ఇస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పంచాయితీ భవనాలని వైసీపీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఓ గ్రామంలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతవరకు వెళ్లింది. ఇదే విషయంపై స్పదించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని కోరారు. మరి రానున్న రోజుల్లో ఈ రంగులు రాజకీయం ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news