ఆంధ్రప్రదేశ్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఆ రెండు మంత్రి పదవుల నుంచి వాళ్ళు తప్పుకొన్నారు. దీనితో ఆ రెండు మంత్రి పదవులు ఎవరితో భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు స్పష్టత రావడం లేదు. పార్టీలో కొందరు కీలక నేతలు ఆ మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
నగిరి ఎమ్మెల్యే ఆర్కే ,రోజా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ,మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక నేత కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విశాఖ వెళ్లి పార్టీ కీలక నేత ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసి తనకు మంత్రి పదవి కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆ మంత్రి పదవి విషయంలో విజయసాయిరెడ్డి నుంచి గానీ పార్టీ ఇతర నేతల నుంచి సదరు నేతకు ఎలాంటి హామీ రాలేదని సమాచారం.
దీనితో ఆయన నేరుగా వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతిని కలిసి తనకు మంత్రి పదవి వచ్చేలా చూడాలని తాను పార్టీలో ముందునుంచి కొనసాగుతున్నానని కూడా చెప్పారట. వాస్తవానికి జగన్ జైల్లో ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో పార్టీకి అండగా ఉండటంతో పాటుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు. దీనితోనే వైయస్ విజయమ్మను కూడా ఆయన మంత్రి పదవి కావాలని కోరినట్లు తెలుస్తోంది. మరి జగన్ ఆయన మంత్రివర్గంలోకి చేర్చుకుంటారా లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా హడావుడి ఉంది కాబట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనపడటం లేదు.