తెలిసి మాట్లాడతారో తెలియకమాట్లాడతారో తెలియదు కానీ… పరిపూర్ణమైన రాజకీయనాయకుడి లక్షణాలను అందిపుచ్చుకోవడంలో పవన్ నిత్యం విఫలమవుతూనే ఉన్నారు! మాటల్లో స్పష్టత, సూటిగా సుత్తిలేకుండా చెప్పే విధానం లోపిస్తుందనే చెప్పాలి. అందుకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది తాజాగా జరిగిన జనసేన విసృతస్థాయి సమావేశం లో పవన్ ప్రసంగం!
తాను ప్రశ్నించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను.. పదవులపై మోజుతో రాజకీయాల్లోకి రాలేదు అని చెప్పుకున్న పవన్… తాజాగా తాను ఎమ్మెల్యే కూడా కాలేకపోయాయననే విచారాన్ని తనదైన శైలిలో వినిపించారు! తనను రెండు చోట్ల ఓడించి, పని చేయమంటే ఎలా? అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. దీంతో… “పరిపాలించడానికి – పెత్తనంచేయడానికి పదవులు కావాలి కానీ… ప్రశ్నించడానికి – పోరాడటానికి పదవులు ఎందుకు పవన్?” అంటూ ఆన్ లైన్ వేదికగా ప్రశ్నల వర్షాలు కురుస్తున్నాయి.
ఇదే క్రమంలో… వ్యూహాత్మకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తప్పించుకునేపనికి పూర్తిగా పూనుకున్నారు పవన్! “నన్ను వైజాగ్ లోనైనా గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం బలంగా నిలబడేవాడ్ని. కానీ నన్ను ఓడించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలా పోరాడాలి చెప్పండి.” ఇది స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ చెప్పిన మాట!
దీంతో… తన మిత్రపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. తనను ఎంతో ప్రేమించి గౌరవించే మోడీతో పవన్ మాట్లాడాలి – విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి అనుకుంటే… అందుకు గాజువాక ఎమ్మెల్యేనే అయ్యి ఉండాలా? జనసేన పార్టీ అధ్యక్షుడు సరిపోడా? బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పార్టీ అధినేత సరిపోడా? ఇవో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!
ఇక్కడ మరో విశ్లేషణ ఏమిటంటే… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రంలో బీజేపీ పాత్ర మాత్రమే ఉంది తప్ప… ఏపీలో జనసేన పాత్రలేదని – తనను ఎమ్మెల్యేగా గెలిపించలేదు కాబట్టి.. తనకు కూడా ఆ బాధ్యత లేదని చెప్పే ప్రయత్నం కూడా పవన్ చేశారని అంటున్నారు విశ్లేషకులు. అంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం పక్క… తాను ఆ విషయంపై పోరాడబోయేది లేదని చెప్పడం కూడా పక్కా అన్నమాట!!