పార్టీల త‌ల‌రాత‌ను డిసైడ్ చేయ‌నున్న హుజూర్‌న‌గ‌ర్ రిజ‌ల్ట్‌..!

-

అంద‌రి చూపూ హుజూర్‌న‌గ‌ర్ వైపే.. మ‌రికొద్ది గంట‌ల్లోనే ఫ‌లితం రాబోతోంది..  ఈ ఫ‌లితం తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చ‌బోతోందా..?  అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీల‌ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుందా..? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పాగా వేయాల‌ని చూస్తున్న క‌మ‌ల‌ద‌ళం ఆశ‌ల్ని నిలుపుతుందా..?  అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ‌లితం ఎవ‌రి ప‌క్షాన ఉన్నా.. రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం వేగంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఇప్ప‌టికే ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావం చూపుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న ఉప ఎన్నిక ఫ‌లితంతో ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాయి. 2018లో వ‌చ్చిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో హుజూర్‌న‌గ‌ర్‌లో టీపీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డిపై స్వ‌ల్ప‌మెజార్టీతో గెలిచారు.ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ ఎంపీగా ఉత్త‌మ్ గెల‌వ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నిక‌లో ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డి బ‌రిలోకి నిలిచారు.

ఇక టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు.  ఈ నెల 21న‌ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. ఈ నెల 24 ఫ‌లితం వెలువ‌డ నుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య జ‌నం కూడా తీవ్ర ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో గెలుపుపై ఎవ‌రికివారు ధీమాగా ఉన్నారు. అయితే.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార టీఆర్ఎస్‌కే అనుకూలంగా వ‌చ్చాయి. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోక‌త‌ప్ప‌ద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు హుజూర్‌న‌గ‌ర్ లో టీఆర్ఎస్ గెల‌వ‌లేదు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో గులాబీ పార్టీ ప‌నిచేసింది. ఫ‌లితం అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ‌స్తే.. ఇక ప్ర‌జా మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌న్న విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్తుంద‌ని, ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ మ‌రింత దూకుడుగా.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆర్టీసీ విష‌యంలో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని రాజ‌కీయ‌ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక‌వేళ ఫ‌లితం ప్ర‌తికూలంగా వ‌స్తే మాత్రం.. ఇక అధికార టీఆర్ఎస్ ప‌త‌నాన్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

మ‌రోవైపు.. ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితు మ‌రింత ద‌య‌నీయంగా మారుతుంద‌ని, దీంతో ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా త‌మ‌దారి తాము చూసుకుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక క‌మ‌ల‌ద‌ళం ఈ ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా నాలుగు స్థానాల‌ను ద‌క్కించుకున్న క‌మ‌ల‌ద‌ళం.. ఈ హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఓట్ల‌శాతం పెంచుకునేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేసింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీజేపీకి నోటాకంటే.. త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి.

ఆ పార్టీ అభ్య‌ర్థికి కేవ‌లం 1555 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ ఉప ఎన్నిక‌లో గెల‌వ‌లేకున్నా.. ఓట్ల సంఖ్య‌ను పెంచుకుంటే మాత్రం క‌మ‌ల‌ద‌ళం మ‌రింత ఉత్సాహంగా ముందుకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌లు కూడా పెరుగుతాయి. ఈ ఎన్నిక‌లో టీడీపీ కూడా పోటీలో ఉంది. ఒక‌వేళ‌.. భారీ సంఖ్య‌లో ఓట్లు వ‌స్తేమాత్రం ఆ పార్టీ కూడా ఇక పున‌ర్నిర్మాణంపై చంద్ర‌బాబు దృష్టి పెడుతారు.

Read more RELATED
Recommended to you

Latest news